YSRCP leader Satish Kumar Reddy | పులివెందుల: తనపై దాడి కుట్ర జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఈ కుట్రకు బాధ్యులని ఆరోపించిన ఆయన, వీరిద్దరిపై సుమోటోగా కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన మీద దాడి జరగబోతున్న విషయం టీడీపీ నేతల ద్వారా తనకు ముందే సమాచారం వచ్చిందని సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పులివెందుల పోలీసులపై సైతం తీవ్ర ఆరోపణలు

పులివెందులలో వైసీపీ నేత మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఇక్కడ పోలీసులు పచ్చరంగు చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. డీజీపీకి ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మీడియా సమావేశం ద్వారా నేను @APPOLICE100 ఏపీ డీజీపీని కోరుతున్నాను. నాకు తెలిసిన సమాచారం ప్రకారం నా మీద దాడి జరగబోతోంది. ఈ విషయం టీడీపీ నేతల ద్వారానే తెలిసింది.

నన్ను హత్య చేయాలని కుట్ర జరుగుతోంది. అదే సమయంలో నాకు రాష్ట్ర పోలీసులపై ఎటువంటి నమ్మకం లేదు. నేను నిరాయుధుణ్ని. నన్ను కాపాడే బాధ్యత పోలీసులదే. మీరు నన్ను కాపాడలేకపోతే కనీసం దాడి జరగకుండా చూడాలి. కానీ నామీద ఏమైనా దాడి జరిగినట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, బీటెక్ రవి ప్రోత్సాహంతో జరిగింది అని పరిగణించాలి. నాపై ఏదైనా దాడి జరిగితే వెంటనే వీరిద్దరిపై సుమోటోగా కేసు నమోదు చేసి, సీబీఐతో విచారణ జరిపించాలి" అన్నారు.

టీడీపీకి తొత్తులుగా మారిన పోలీసులు

పులివెందులలో ఉన్న పోలీసులపై కూడా సతీష్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి పోలీసులు పోలీసోళ్లు కాదు. పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగున్నారు. డీఎస్పీ, రూరల్ సీఐ, డీఐజీలు పోలీస్ సిబ్బందికి పెత్తనం ఇచ్చారు. నిజాయితీగా పని చేసే అధికారులు పక్కకు జరిగారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో తమకు న్యాయం జరగదని వైసీపీ నేత స్పష్టం చేశారు. పోలీసులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారని, వైసీపీ నేతలను వేధించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.