YSRCP Ex MP Gorantla Madhav fires on Chandrababu | అనంతపురం: తిరుపతి లడ్డూలపై అసత్య ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీ వెంకటేశ్వరస్వామి తగిన శిక్ష వేస్తారని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఇదే విషయంలో సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సనాతన ధర్మం అంటే సత్యంతో కూడిన పాలన అని.. కానీ దానిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటించలేదని విమర్శించారు. లౌకిక వాదమే ఈనాటి సనాతన ధర్మం అని గుర్తించాలన్నారు.


వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుని హిందువులపై రాజకీయాలు


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య ఓ క్రిస్టియన్ అది గుర్తుంచుకోవాలని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ హితవు పలికారు. క్రిస్టియన్ అయినటువంటి విదేశీయురాలని పెళ్లి చేసుకొని ఇప్పుడు హిందూ మతం పేరుతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడం దారుణం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆ ఆరోపణలపై ఏం చేశావని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అని.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం తిరుపతికి వెళ్తానంటే జగన్ కు అనుమతి ఇవ్వకుండా కొండపైన గుండాలను పెట్టిన ప్రభుత్వం కూటమి సర్కార్ అని అన్నారు. 


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పిల్లలను చూసేందుకు లండన్ కు వెళ్లకుండా పాస్ పోర్ట్ లాక్కొని మానసిక వేదనకు గురి చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేయటం హేమమైన చర్య అన్నారు. ఏపీలో 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అనేక దారుణాలకు పాల్పడిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించమంటే దాడులు చేసుకుంటూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేలా వారి పరిపాలన కొనసాగుతుందని ఈ వంద రోజుల్లోనే తేలిపోయిందన్నారు. 

సూపర్ సిక్స్ చేయలేక తెరపైకి లడ్డూ వివాదం
తిరుపతి లడ్డు ప్రసాదం వివాదానికి తెరలేపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ఇలాంటి వివాదాలను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. చంద్రబాబు సిట్ తో దర్యాప్తు అని చెబితే.. కేంద్రం సిబిఐ అని చెప్పింది. చివరగా సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగలడంతో ఏమి తోచని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయుధంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన వైసీపీ నాయకులు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయిస్తూ ఆ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మీరు చేసే కుట్రలు కుతంత్రాలు దాడులకు వైఎస్ఆర్సిపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడరని హెచ్చరించారు.
Also Read: Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్