YS Sharmila Comments on Jagan: కడప వేదికగా రాజకీయం మరింత వేడెక్కుతోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడైన వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై మరింత డోసు పెంచి విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కడపలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. కడపలో ఓవైపు వైఎస్ బిడ్డ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతోందని.. మరోవైపు హంతకుడు ప్రత్యర్థిగా ఉన్నాడని షర్మిల అన్నారు. మీ ఆడబిడ్డలం కొంగుచాచి అడుగుతున్నామని అన్నారు. మీరే న్యాయం చేయాలని.. వైఎస్ బిడ్డనా.. హంతకుడా.. మీరే న్యాయ నిర్ణేతలు కావాలని పిలుపు ఇచ్చారు. ‘‘వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలి’’ అని షర్మిల మాట్లాడారు.


ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘‘మేము వస్తున్నామని తెలిసి లైట్లు తీశారట. లైట్లు ఉండవు అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయినట్లు. లైట్లు కావాలని తీశారు తీశారు అంటే అవినాష్ రెడ్డికి భయం పట్టుకున్నట్లు. వివేకా హత్య విషయంలో సునీతమ్మ ఎంతో బాధపడింది. న్యాయం జరగడం లేదని అవేదన పడింది. నేను జగన్ ఆన్న కోసం 3200km పాదయాత్ర చేశా. ఆన్న కోసం ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి తిరిగా. జగన్ ఆన్న ముఖ్యమంత్రి అయితే YSR సంక్షేమ పాలన వస్తుంది అనుకున్నా. పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి అవుతాయి అనుకున్నా. వైఎస్ఆర్ పథకాలు అన్ని అమలు అవుతాయి అనుకున్నా. జగన్ అన్న కోసం ఏది చెప్తే అది చేశా. ఓదార్పు యాత్ర కూడా చేశా.  జగన్ మోహన్ రెడ్డికి నేను ఒకప్పుడు చెల్లి కాదు.. బిడ్డను. 


సీఎం జగన్ నాకు పరిచయం లేదు
కానీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మొత్తం మారిపోయాడు. ఈ మారిన జగన్ ను నేను ఎప్పుడు చూడలేదు. ఈ సీఎం జగన్ నాకు పరిచయం లేదు. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయింది. వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న. సొంత రక్త సంబంధానికి న్యాయం చేయక పోతే మనం ఎందుకు? వైఎస్ వివేకా ఇక్కడే ఉంటారు. ఆయన గడప తొక్కని కుటుంబం ఈ పులివెందులలో లేనే లేదు. ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం చేసే వాడు. తన కార్లో తీసుకొని మరి అధికారుల దగ్గరకు వెళ్లే వాడు. ఇలాంటి నాయకుడిని దారుణంగా హత్య చేశారు. గొడ్డలితో నరికి నరికి చంపేశారు. ఘోరంగా, క్రూరంగా చంపేశారు. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు.


జగన్ తన అధికారాన్ని అడ్డంగా పెట్టి మరి హంతకులను కాపాడుతున్నారు. హంతకులను జగన్ వెనకేసుకు వస్తున్నాడు. CBI అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. హత్య చేసింది అవినాష్ రెడ్డి కుటుంబం అని చెప్పింది. ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. గూగుల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పింది. హత్యకు ముందు డబ్బుల పంపిణీ కూడా జరిగింది. అన్ని ఆధారాలు ఉండి కూడా CBI అవినాష్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేక పోయింది. జనాలు జగన్ ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా? జగన్ పులివెందుల పులి కాదు..పిల్లి. పిల్లిలా మారి బీజేపీ కి జగన్ బానిస అయ్యాడు’’ అని వైఎస్ షర్మిల విమర్శించారు.


ఆ రోజు చూడకూడనివి చూశా - సునీత
వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన రోజునాటి సంగతులను వివరించారు. ‘‘వివేకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆపమని నేను చెప్పాను. నేను ఏరియా ఆసుపత్రిలో చూడగూడని దృశ్యాలు చూశా. తల నుంచి ఎముకలు, మెదడు బయటకు వచ్చాయి. ఏమయ్యిందో అర్థం కాలేదు. పోలీసులు వస్తున్నారు.. పోతున్నారు. అసలు ఏం జరిగిందో తేల్చుకోలేక పోయాం. చనిపోయిన ఇంట్లో నన్ను ఉండకూడదు అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఎవరు చేశారో తెలియలేదు. ఇంతలో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను జగన్ ను కలిశా. న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ గా ఉండి దోషులకు శిక్ష వేయక పోతే నాకు అవమానం అన్నారు.


జగన్ అన్నను బాగా నమ్మా
అప్పుడు నేను జగన్ అన్నను బాగా నమ్మాను. కేసు ఏటు తేలలేదు. అనుమానం వచ్చి CBI కి పోదాం అని చెప్పా. అప్పుడు జగన్ నన్ను వద్దు అని చెప్పారు. మనం CBI కి పోతే అవినాష్ రెడ్డి బీజేపీకి పోతాడట అని చెప్పారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నా. కచ్చితంగా CBI కి వెళ్ళాలని. కోర్టును ఆశ్రయించా. అప్పుడు కోర్టు ద్వారా కేసు CBI కి కేసు బదిలీ అయింది. CBI విచారణలో దారుణ విషయాలు తెలిశాయి. వైఎస్ ని చంపితే ఆయనకు కొడుకులు లేరు అనుకున్నారు. ఉన్న ఒక్క ఆడది ఏం చేస్తుందిలే అనుకున్నారు. దోషులకు శిక్ష పడే పోరాటం. హత్య చేసిన వారికి శిక్ష పడాలి. షర్మిలను గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంట్ కి వెళ్తుంది. మన కష్టాలు అర్థం చేసుకుంటుంది. అందుకే ఇవ్వాళ మనం షర్మిలను గెలిపించాలి. న్యాయం వైపు నేను షర్మిల ఉన్నాము. ధర్మం వైపు మేం నిలబడ్డాం. ప్రజలు ఏ వైపు ఉన్నారో అర్థం చేసుకోవాలి’’ అని సునీతా రెడ్డి కోరారు.