YSRCP Chief YS Jagan Mohan Reddy | బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగాళరుపాళ్యానికి వెళ్లారు. బంగారుపాళ్యం దగ్గర వైసీపీ అధినేత జగన్ కాన్వాయ్ నుంచి దిగేందుకు యత్నించగా కారు దిగకుండా ఎస్పీ ఆయనను అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని, గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేయగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ తిరిగి కాన్వాయ్‍లో జగన్‍ను ఎక్కించి, అక్కడి నుంచి పంపించివేశారు. తరువాత బంగారుపాళ్యం మామిడి మార్కెట్ కు జగన్ చేరుకుని రైతులతో ముఖాముఖీ నిర్వహిస్తున్నారు. పండించిన మామిడి పంటకు ప్రభుత్వం ధర కల్పించడం లేదని, వారికి మద్దతుగా నిలిచేందుకు జగన్ ఇటీవల బంగారుపాళ్యం పర్యటన ఫిక్స్ చేసుకున్నారు.
పోలీసుల లాఠీచార్జ్ పై వైఎస్ జగన్ (YS Jagan) సీరియస్
చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్ లో యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు గాయమైందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. గాయపడ్డ పార్టీ నేతను పరామర్శించడానికి అవకాశం ఇవ్వరా అంటూ మండిపడ్డారు. బంగారుపాళ్యంలో తనను కలిసేందుకు వచ్చిన ఓ అవ్వను మాజీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నావు అవ్వా అని అడిగారు.
భారీ సంఖ్యలో తరలివస్తున్న వైసీపీ కార్యకర్తలు
చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళ్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, రైతులు అక్కడికి తరలి వస్తున్నారు. జగన్ రావడానికి ముందే భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మార్కెట్ యార్డులోకి వెళ్లారు. అయితే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఉందని, మార్కెట్ యార్డులో సైతం 500 మందికి తాము అనుమతి ఇచ్చామని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. ర్యాలీలు, రోడ్‌షోలు చేసినా, సభ లాంటివి నిర్వహించే ప్రయత్నం చేస్తే కనుక చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ (YSRCP) నేతల ఆరోపణ
తమను అడ్డుకోవడంతో మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, చిత్తూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయానంద రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్లలో వెళ్లడానికి ఎలాగూ పర్మిషన్ లేదన్నారు. బైకు మీద కూడా వెళ్లకూడదా అని పోలీసులను విజయానంద్ ప్రశ్నించారు. ఎందుకు ఆపుతున్నారు అంటే, పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జగన్ కు మద్దతుగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ నుంచి వెళ్లిన వైఎస్ఆర్సిపి నాయకులను చిత్తూరు జిల్లా టిటిడిసి కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారని పార్టీ నేతలు ఆరోపించారు.