YS Jagan Mohan Reddy provide 108 Ambulance to save a Life: పులివెందుల: సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కోమన్నూతలకు చెందిన నరేంద్ర అనే యువకుడు నీటిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. పక్కనే ఉన్న నరేంద్ర సన్నిహితులు 108 వాహనానికి ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దాంతో సన్నిహితులు నరేంద్రను ద్విచక్ర వాహనంపై పులివెందులలోని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు.
మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ
మరోవైపు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ లింగాల మండలం పెద్ద కుడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆగి చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో బైకుపై ప్రాణపాయ స్థితిలో ఉన్న నరేంద్రను అతడి సన్నిహితులు తీసుకువచ్చారు. తాము 108 కు ఫోన్ చేస్తున్నా రాలేదని, కనీసం కాన్వాయ్ లో ఉన్న 108 వాహానంలో బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని కోరారు. వైఎస్ జగన్ కు విషయం చేరవేయగా.. ఆయన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్ లో నరేంద్రను ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
హుటాహుటిన 108లో ఆక్సిజన్ సహాయంతో పులివెందుల మెడికల్ కళాశాలకు బాధితుడ్ని తీసుకెళ్లారు. సకాలంలో వైఎస్ జగన్ సాయం చేయడం, వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో నరేంద్ర ప్రాణాలు నిలిచాయి. నరేంద్ర ప్రస్తుతం పులివెందుల మెడికల్ కళాశాలలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు 108కు ట్రాఫిక్ క్లియర్ చేసి, పలువురి ప్రాణాలు కాపాడిన వైఎస్ జగన్ తాజాగా మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. దాంతో ఓ యువకుడు ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు. సకాలంలో సాయం చేసిన మాజీ సీఎం జగన్‌కు నరేంద్ర కుటుంబసభ్యులు, సన్నిహితులు ధన్యవాదాలు తెలిపారు.