AP High Court Verdict On Kappatralla Murder Case: ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన కర్నూలు (Kurnool) జిల్లా కప్పట్రాళ్ల హత్యాకాండకు (Kappatralla Murder Case) సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది హత్యకు గురి కాగా.. ఈ కేసులో జీవిత ఖైదు పడిన దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు సహా 17 మంది నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు ఆదోని కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షను రద్దు చేసింది. నేర నిరూపణకు నిందితులపై పోలీసుల సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవన్న వారి తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం వారికి విముక్తి కల్పించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది.


ఇదీ జరిగింది


ఉమ్మడి ఏపీలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన పాలెగారి వెంకటప్పనాయుడు, మాదాపురం మద్దిలేటినాయుడి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఈ క్రమంలో 2008, మే 17న వెంకటప్పనాయుడితో పాటు మరో 10 మంది దారుణ హత్యకు గురయ్యారు. బోదెపాడు వద్ద వీరిని వాహనాలతో ఢీకొట్టి, బాంబులు విసిరి వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై విచారించిన పోలీసులు మద్దిలేటినాయుడు సహా మరికొందరిపై హత్య కేసు నమోదు చేశారు.


అనంతరం హత్యా నేరం నిరూపణ కావడంతో ఆదోని రెండో సెషన్ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు 17 మందికి జీవిత కాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. 2014, డిసెంబర్ 10న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఇటీవలే తీర్పు వాయిదా వేసింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రద్యుమ్నకుమార్ రెడ్డి, పి.వీరారెడ్డి, న్యాయవాదులు కైలాసనాథరెడ్డి, డి.కోదండరామరెడ్డి, చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోలీసులు కోర్టు ముందు ఉంచిన సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవని తెలిపారు. వీరి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ కేసులో దోషులను నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, జీవితఖైదు పడిన వారిలో నలుగురు అనారోగ్యంతో మృతి చెందారు. తాజా తీర్పుతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.


Also Read: Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!