వివాహేతర సంబంధాలతో కుటుంబాలు కుప్పకూలుతున్నాయి. మరికొందరు జైళ్లకు వెళ్తున్నారు. మొన్నటికి మొన్న వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను, ఆమె ప్రియుడ్ని కిరాతకంగా చంపేశాడో భర్త. హైదరాబాద్‌లో సంచలనంగా మారిందీ కేసు. సత్యసాయి జిల్లాలో అంతకు మించిన సెన్సేషనల్ కేసు వెలుగులోకి వచ్చింది. 


ధర్మవరంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన గంగాధర్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. ఇచ్చిన అప్పులు తీర్చలేదని కాల్‌మనీ గ్యాంగ్‌ తన భర్తను చంపేసిందని భార్య లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారులపై అనుమానం ఉందని చెప్పారు. దీంతో ఇది కాల్‌మనీ మర్డర్ అంటూ ధర్మవరంలో సంచలనం సృష్టించింది.


పోలీసులు కూడా అదే కోణంలో విచారణ మొదలపెట్టారు. విచారణ చేస్తున్న కొద్దీ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ హత్యకు కాల్ మనీ కాదు... కట్టుకున్న భార్యే కాలనాగై కాటేసిందని తెలుసుకున్నారు. ఇదే పోలీసులకు షాకింగ్ కలిగిస్తే హత్యకు నిందితురాలి అన్న, అల్లుడు కూడా హెల్ప్ చేశారని తెలిసి బిత్తరపోయారు. 


ధర్మవరంలో లక్ష్మీదేవికి తారకరామాపురానికి చెందిన భాస్కర్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని స్పాట్ పెట్టింది భార్య లక్ష్మిదేవి. దారుణమైన పన్నాగం పన్నింది. అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన గంగాధర్‌ను లేపేసి ఆ మర్డర్‌ను వడ్డీ వ్యాపారులపై వేసేలా ప్లాన్ చేసింది. ఒక దెబ్బకు అప్పు, భర్త రెండు పీడలు విరగడవుతాయిని స్కెచ్‌ గీసింది.


ప్లాన్‌ను అన్న వెంకటేష్‌, కూతురి భర్త సుధాకర్‌కి చెప్పింది. ఈ హత్య చేసుందకు సుపారీ ఇచ్చేందుకు ముందకు వచ్చింది. పని ఒప్పుకున్న వీళ్లిద్దరు ఏప్రిల్ ఎనిమదో తేదీన ధర్మవరంలోని ఎల్పీ కూడలి వద్ద ఉన్న రైల్వే పార్క్‌లో గంగాధర్‌ను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.


ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం పోలీసులను భార్య తప్పుదోవ పట్టించింది. తన భర్తను వడ్డీవ్యాపారులే హత్య చేశారని ఫిర్యాదు చేసింది. అప్పటకే ధర్మవరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో మీడియా కూడా పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకొన్న పోలీసులు అసలు గుట్టు రాబట్టారు. 


విచారణలో నిందితురాలు లక్ష్మిదేవికి ఉన్న అక్రమ సంబంధం సాంకేతికత ఆధారంగా ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తమదైన స్టైల్‌లో విచారణ చేసే సరికి నిందితులు తాము చేసిన దారుణాన్ని ఒప్పుకొన్నారు.


వివాహేతర సంబంధాల కోసం భర్తనే హత్య చేసి ఇతరులపైకి నెట్టేయాలని చూసిన ఆమె ప్లాన్‌కు అంతా షాక్ అయ్యారు. పోలీసులు ముగ్గురు నిందితలును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంచలనంగా మారిన కేసులో పోలీసులు వ్యూహాత్మకంగా సాంకేతికతను ఉపయోగించి ఛేదించడంతో ధర్మవరం పోలీసులను అభినందించారు సత్యసాయి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ సింగ్.