అనంతపురం జిల్లా రాయదుర్గం నాలుగో వార్డులో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్ అలియాస్ ఉమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్య కు కారణంగా వాలంటీర్ వ్యవస్థేనని సూసైడ్ నోట్ రాయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వాలంటీర్‌గా విధుల్లో చురుకుగా వ్యవహరించే మహేష్ 12వ తేదీన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కుటుంబసభ్యులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. సూసైడ్ లెటర్‌లో వాలంటీర్ ఉద్యోగంతో రోజంతా చాకిరి చేస్తున్నా సరైన జీతం రావడం లేదని ... ఈ కారణంగా అప్పుల పాలయ్యాయని పేర్కొన్నారు. వాలంటీర్‌గా తనతో అధికారులు గొడ్డు చాకిరీ చేయించుకున్నారని... కనీసం తిన్నారా లేదా అన్నది కూడా ఎప్పుడూ చూడలేదని.. ఆవేదన వ్యక్తం చేశాడు.
జీతాలు పెంచేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని.. చేసేది ఉద్యోగం కాదు సేవ మాత్రమేనని సీఎం జగన్ చెప్పడం బాధాకరమని అని సూసైడ్ నోట్‌లో మహేష్ పేర్కొన్నాడు. వాలంటీర్ గా పని చేయడానికి రోజంతా వెచ్చించాల్సి వస్తోందని... సమయం సరిపోక అదనపు ఆదాయం సంపాదించే మార్గం లేక జీవనం గడపడానికి అప్పుల పాపలయ్యానని లేఖలో మహేష్ పేర్కొన్నారు. ఈ ఉద్యోగం మానేస్తే మళ్లీ వస్తుందో లేదో అనే ఆందోళన .. అప్పుల బాధలు... పైఅధికారుల ఒత్తిడి ఇన్ని సమస్యల మధ్య జీవిస్తున్న తన లాంటి దుర్భర పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆవేదన చెందాడు. తన చేసిన అప్పుల్ని తీర్చాల్సిన బాధ్యత మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని లేఖలో పేర్కొని అప్పుల వివరాలు పొందుపరిచాడు. అలాగే చనిపోయిన తన తల్లి పేరున ఇంటి పట్టాను అన్న, చెల్లెలు పేరు మీద మార్చాలని సీఎం జగన్‌ను కోరారు.
మహేష్ రాసిన సూసైడ్ లెటర్‌లో అప్పులు మరీ భారీగా లేవు. ముగ్గురికి చిట్స్.. మరికొంత మంది దగ్గర రూ. పదివేల వరకూ అప్పులు చేసినట్లుగా ఉంది. అయితే మహేష్ సూసైడ్ నోట్‌లో వ్యక్తం చేసిన ఆవేదన వాలంటీర్లు అందరిదని విపక్ష నేతలుఅంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని రాయదుర్గం టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. మహేష్ కుటుంబానికి న్యాయం చేసి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్లు కొద్ది రోజుల కిందట జీతాలు పెంచాలని ఆందోళన చేశారు. అయితే వారికి ఇస్తున్నది గౌరవ వేతనమేనని.. సేవా భావంతో పని చేస్తున్నారని చెప్పిన సీఎం జగన్.. తర్వాత అందిరికీ అవార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. అనేక మందికి నగదు బహుమతులు కూడా ఇచ్చారు. అయితే ఉన్నతాధికారులు తమతో రోజంతా పని చేయించుకుంటున్నారని తమకు వేరే ఆదాయం లేకుండా పోయిందని మహేష్ లాంటి వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.