Tomato Price: టమాటా ధర భారీగా పడిపోతోంది. 200 రూపాయలు పెడితే కానీ కిలో టమాటా రాని పరిస్థితి నుంచి క్వింటాలుకు రూ.200లు మాత్రమే వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే కిలోకు రూ.2 మాత్రమే. టమాటా ధరలు విపరీతంగా తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట అమ్మితే వచ్చే మొత్తం.. కనీసం పంట కోతకు కూడా సరిపోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది. రిటైల్ మార్కెట్లలో కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుండగా.. హోల్‌సేల్‌ మార్కెట్ లో రూ.3 నుంచి రూ.2 మాత్రమే పలుకుతోంది. ఈ రేట్లు ఏమాత్రం గిట్టుబాటు కాక టమాటా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 


కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్ లో కిలో టమాటా రూ.2 మాత్రమే పలుకుతుండటంతో రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. టమాటా పంట మార్కెట్లకు ఇబ్బడిముబ్బడిగా వస్తోంది. సప్లై విపరీతంగా ఉండటం, డిమాండ్ అంతగా లేకపోవడంతో టమాటా విక్రయాలు చాలా తగ్గాయి. మార్కెట్లలో టమాటా కొనే వారు కూడా ఎక్కువగా ఉండటం లేదు. దీంతో ధర భారీగా పడిపోయి.. విపరీతమైన నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, పురుగుల మందులు, కలుపు తీత, పంట కోత లాంటి ఖర్చులు కూడా మిగలటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


రెండు నెలల క్రితం టమాట ధరలు సంచలనం సృష్టించాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని అంటాయి. కిలో టమాట రూ.300 వరకు పలికింది. కొందరు రైతులైతే కోట్లలో ఆర్జించారు. అయితే సాధారణ మధ్యతరగతి పౌరుడు మాత్రం ఇబ్బంది పడ్డాడు. వంద రూపాయలు పెట్టినా ఐదు టమాటలకు మించి రాకపోవడంతో ఆందోళన చెందాడు. దాంతో పాటే పచ్చి మిర్చీ ఇతర కూరగాయలు పెరగడంతో జేబుకు చిల్లు పడింది. ఇంటి బడ్జెట్‌ పెరిగి పోయింది.


వేసవిలో విపరీతంగా ఎండలు కొట్టడంతో టమాట దిగుబడి  తగ్గిపోయింది. అదే సమయంలో కొన్ని చోట్ల అతి వృష్టితో టమాట పంట నాశనమైంది. మరికొన్ని చోట్ల వర్షాలు లేక తోటలు ఎండిపోయాయి. ఉత్తరాదిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వారం రోజుల్లోనే టమాట రూ.30 నుంచి 300కు చేరుకుంది. ధరల్లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేపాల్‌ నుంచి టమాటను దిగుమతి చేసుకుంది. దక్షిణాది నుంచి దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా మార్కెట్లకు టమాటాలు తరలించింది. సాధారణంగా టమాట పంట మూడు నెలల్లో చేతికొస్తుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లకు అధిక స్థాయిలో టమాట వస్తోంది. దాంతో హోల్‌సేల్‌ ధరలు పడిపోతున్నాయి. మైసూర్‌లోని ఏపీఎంసీ మార్కెట్లో ఆదివారం కిలో టమాట రూ.14కు దిగొచ్చింది. శనివారం నాటి రూ.20 నుంచి ఆరు రూపాయలు తగ్గింది. ఇదే సమయంలో బెంగళూరులో కిలో టమాట రూ.30-35 వరకు పలుకుతోంది.


మండిపోతున్న ఉల్లి ధరలు


రోజురోజుకూ ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వం నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లకు తరలిస్తున్నప్పటికీ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇందుకు కారణం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉల్లి సాగు తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో కూడా కొత్త పంట చేతికి రాకపోవడంతో రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏపీలో ఉల్లి సాగు తగ్గడంతో ధరలు కూడా రెండు రెట్లు పెరిగాయి. మార్చి నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయలు కిలోగా ఉన్న ఇల్లి ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు వరకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.