అనంతపురం జిల్లాకు కీలకమైన పెన్నా నది గత దశాబ్దాల కాలం తరువాత నిండుగా ప్రవహిస్తుంది. పెన్నా నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్ని జళకళను సంతరించుకొన్నాయి. ఎప్పుడూ నిర్జీవంగా కన్పించే పెన్నానది నీటితో పరవళ్ళు తొక్కుతుంటే అనంత జిల్లా వాసులు మురిసిపోతున్నారు. మై మరిచిపోతున్నారు. ఎప్పుడు వేరే ప్రాంతాల్లో నదులను చూసి తమ ప్రాంతంలోని పెన్నానది ఎప్పుడు ఈ విధంగా ప్రవహిస్తుందా అని చూసేవారు. 


కర్ణాటకలోని నందిహిల్స్ ప్రాంతంలో ప్రారంభమయ్యే పెన్నానదిపై అనంతపురం జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు నిర్మించారు. జిల్లాలో ప్రారంభం అయ్యే పేరూరు సమీపంలో పేరూరు ప్రాజెక్ట్ కట్టారు. దీని కింద వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే గత పది సంవత్సరాలుగా ఈ డ్యాం గేట్లు ఎత్తింది లేదు. అలాంటి పేరూరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. దీంతో దిగువకు నీటిని వదిలారు.పేరూరు ప్రాజెక్ట్ తరువాత పెన్నా నదిపై పిఏబిఆర్ ప్రాజెక్ట్ పది టిఎంసిల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు డ్యాం గేట్లు ఎత్తింది లేదు. అలాంటి పిఏబిఆర్ ప్రాజెక్ట్ గేట్లు కూడా మొట్టమొదటిసారి ఎత్తి నీటిని నదిలోకి వదిలారు. దీని తరువాత పెనకచర్ల సమీపంలో మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎప్పుడూ నీటిని ఆయకట్టుకు వదిలేవారు కాదు. కానీ పైనుంచి నీరు  సమృద్దిగా వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ డ్యాం గేట్లు కూడా ఎత్తారు. దీంతో ఇక్కడి నుంచి చాగల్లు రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. ఇప్పటికే నిండుకుండలా ఉన్న చాగల్లు రిజర్వాయర్ కూడ నిండిపోవడంతో దిగువకు నీటిని వదిలేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా పెన్నా నది నిండుగా ప్రవహిస్తూ అందరిని ఆకట్టుకొంటుంది.


ఎప్పడూ హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాల కోసం  కొట్టుకొనే జిల్లా ప్రజలకు పెన్నానది నిండుగా ప్రవహిస్తే ఎంత బాగుంటుందన్న చర్చ నడుస్తోంది. కృష్ణా జలాల  కోసం నేతలు ఎప్పడు సిగపట్లు పట్టేవారు. ముందు తమ ప్రాంతానికి అంటే తమ ప్రాంతానికి అంటూ గొడవలకు దిగేవారు. ఈ సంవత్సరం మాత్రం అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పెన్నా నిండుగా ప్రవహిస్తుండడంతో ఎప్పడూ ఇదేవిదంగా ఉంటే ఎలా ఉంటుంది అన్న భావనలో ఉన్నారు జిల్లా ప్రజలు.


కర్ణాటకలో కూడా పెన్నా నది విశ్వరూపం చూపిస్తోంది. చిక్బళ్ళాపూర్ జిల్లాలో పలుచోట్ల పెన్నానది వరదలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎక్కడికక్కడ పెన్నాపై ప్రాజెక్ట్లు కట్టిన కర్ణాటక ప్రభుత్వం... దిగువకు నీటిని వదులుతోంది. దీని ప్రభావంతో కింది ప్రాంతాల్లో కూడా అదేస్థాయిలో ప్రవహిస్తూ వస్తోంది. వీటిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు.పెన్నాతోపాటు మరో కీలకమైన చిత్రావతి నది కూడా అదే స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో జిల్లాలో కీలకమైన పెన్నా, చిత్రావతి నదులు నిండుకుండల్లా ప్రవహిస్తూ అందరిని ఆకట్టుకొంటున్నాయి.