Andhra Pradesh: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన గన్ మ్యాన్‌లను వెనక్కి పంపిన ఘటన తీవ్ర చర్చని అంశంగా మారింది. ఎటువంటి క్యాడర్ లేని వైఎస్ఆర్సీపీ నేత మహానంద రెడ్డికి గన్ మ్యాన్‌లను కేటాయించడంపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ పోలీసులు మారలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వైసీపీ నేతలకు, నేరచరిత్రతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి భద్రత కల్పించడాన్ని ప్రశ్నిస్తున్నారు. 


పోలీసుల తీరుపై వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ గన్‌మెన్‌లను వెనక్కి పంపినట్లు తెలిపారు. ఇదే విషయం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా పోలీసు శాఖలో వైసీపీ సానూభూతిపరులు ఉన్నారని ఆరోపించారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌లో పనిచేసే అధికారులు ప్రతిపక్షానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జిల్లా బహిష్కరణ చేయాల్సిన సంఘ వ్యతిరేక శక్తులకు భద్రత కల్పించడం ఏంటంటూ జిల్లా పోలీసు అధికారుల తీరును ఎమ్మెల్యే ప్రశ్నించారు. 


ఎవరు ఈ మహానంద రెడ్డి : 
రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు మహానంద రెడ్డికి ప్రభుత్వ గన్‌మెన్‌లను కేటాయించింది. అందుకు నిరసనగా తన సెక్యూరిటీని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెనక్కి పంపించాడు. హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే ఉన్నపలంగా అక్కడి నుంచే తమ గన్‌మెన్‌లను తిప్పి పంపినట్లు సమాచారం. మహానంద రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల ముందు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే క్రమంలో వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. రాప్తాడు వైసీపీలో ప్రధాన నాయకుడిగా ఉన్న తనకు తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం వన్ ప్లస్ వన్ గన్ మెన్‌లను కేటాయించింది. దీన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించారు. గన్ మెన్‌లను వెనక్కి పంపించారు. 


Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్, అక్టోబరులో సెలవుల పండగ - స్కూళ్లకు ఏకంగా 16 రోజులు హాలీడేస్