School Holidays in October Month: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అక్టోబరు నెలలో భారీగా సెలవులు రానున్నాయి. ఏడాదిలో అత్యధికంగా పండగలు వస్తుండటంతో.. దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్‌లో 16 రోజులపాటు పాఠశాలలు మూతపడనున్నాయి. అక్టోబరు 2 నుంచి 14 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబరు 15న తిరగి పాఠశాలలు తెరచుకోనున్నాయి. అనంతరం అక్టోబరు 21 నుంచి 28 వరకు 'సమ్మేటివ్ అసెస్‌మెంట్(SA)-1' పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇక అక్టోబరు 31న దీపావళి రోజున సెలవు ఉంటుంది. దీంతో 14 రోజులు పండగ సెలవులతోపాటు.. అక్టోబరు 20, 27 ఆదివారాలు కలిపి.. అక్టోబరు నెలలో మొత్తం 16 రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే అక్టోబరులో కేవలం 14 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయన్నమాట.  


2024-25 అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయి. ఇక డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు ఇవ్వనున్నారు. దసరాకు ముందు బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన ఉండనుంది. ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. అంటే దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు.


పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ అక్టోబర్‌ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-1 పరీక్షలను, డిసెంబర్‌ 12 లోపు ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-3 పరీక్షలను, 2025 జనవరి 29 లోపు ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-4 పరీక్షలను పూర్తిచేయనున్నారు.
➥ ఇక పదోతరగతి వార్షిక పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.


ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు..
ఏపీలో ఈఏడాది 11 రోజులపాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబరు 13 వరకు దసరా సెలవులు కొనసాగగా.. అక్టోబరు 14 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. మొదట రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 4 నుంచి దసరా సెలువులు ఇవ్వనున్నట్లు అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించగా.. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఒకరోజు అంటే అక్టోబరు 3 నుంచే దసరా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అక్టోబరు 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 11 నుంచి 13 వరకూ దసరా సెలవులు ఉంటాయి. అలాగే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకూ ఇస్తారు. మిగతా అన్ని పాఠశాలలకు డిసెంబరు 25న మాత్రమే క్రిస్మస్ సెలవుదినంగా ఉంటుంది. ఇక అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19 వరకు ఉండనున్నాయి. అయితే క్రైస్తవ మైనార్టీ పాఠశాలలకు మాత్రం జనవరి 11 నుంచి 19 వరకు సెలవులు ఉండనున్నాయి.


ఏపీలో విద్యాసంవత్సరం సెలవులు ఇవే..
➥ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➥  క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➥ అక్టోబరు 31న దీపావళి
➥ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు. 
➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.
➥ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..