AP Minister Satyakumar News | ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర మంత్రి సత్య కుమార్ కాన్వాయ్ ని టిడిపి నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న టిడిపి నేతలు ఒక్కసారిగా మంత్రి సత్యకుమార్ కారును అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి కాన్వాయిని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
బీజేపీ ఆఫీసు ఎదురుగా టిడిపి నేతల ఆందోళన :
ధర్మవరం నియోజకవర్గంలో బిజెపి కార్యాలయం ఎదురుగా టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మవరం మున్సిపల్ చైర్మన్ గా మల్లికార్జునను నియమించడమే ఈ ఆందోళనకు కారణం. గత వైసిపి ప్రభుత్వంలో ధర్మవరం మునిసిపల్ కమిషనర్ గా ఉన్న మల్లికార్జున తెలుగుదేశం పార్టీ నేతలను కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశాడని మళ్లీ తనని మున్సిపల్ కమిషనర్ గా తీసుకురావడం సరైంది కాదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి సత్య కుమార్ కు చెప్పినప్పటికీ వారి మాటలు పెడ చెవిన పెట్టి ధర్మవరం కమిషనర్ గా మల్లికార్జున నియమించడంతో స్థానికంగా రాజకీయాలు వేడెక్కాయి.
ధర్మవరంలో తెలుగుదేశం అండతో గెలిచిన బీజేపీ
ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి పెద్దగా క్యాడర్ లేదు. అందులోనూ రాయలసీమ జిల్లాలలో అసలే లేదు. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి, జనసేన కూటమిగా పోటీ చేయడంతో కూటమి అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గానికి బిజెపి నేత సత్యకుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ కు ఈ విషయంలో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలతో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో అన్ని తానై ఎన్నికల్లో సత్యకుమార్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎంతలా అంటే సత్యకుమార్ గెలుపు తన గెలుపుగా భావించి నియోజకవర్గంలో క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చి సత్య కుమార్ గెలుపుకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం లో నోటా కంటే బిజెపికి తక్కువ ఓట్లు పడ్డాయి. అలాంటి చోట గత ఎన్నికల్లో బిజెపి గెలిచిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ క్యాడర్ పరిటాల శ్రీరామ్ కృషి. అలాంటిది తెలుగుదేశం పార్టీ నేతలకు అన్యాయం చేసిన అధికారులను నియోజకవర్గంలో తీసుకురావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.
పరిటాల శ్రీరామ్ వార్నింగ్ :
గత వైసిపి ప్రభుత్వం ధర్మవరం పట్టణం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున పనిచేశాడు. ఆ క్రమంలో ధర్మవరంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను కార్యకర్తలను కమిషనర్ మల్లికార్జున తీవ్రంగా వేధించారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి అనుకూలంగా పనిచేసి తెలుగుదేశం నేతలను అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. 2021 నుంచి 2023 వరకు ధర్మవరంలో పనిచేసిన కమిషనర్ మల్లికార్జున అనంతరం కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి రావడంతో మంత్రి సత్య కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో మరొకసారి కమిషనర్ గా మల్లికార్జున కు పోస్టింగ్ ఇచ్చారు. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యతిరేకించారు.
గతంలో మునిసిపల్ స్థలాలను వైసిపి నేతలకు అప్పనంగా అప్పగించిన కమిషనర్ ను ఎలా కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పోస్టింగ్ ఇస్తారని తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. ఏకంగా ధర్మవరం పట్టణంలో మంత్రి కార్యాలయం ఎదురుగనే ధర్నాకు దిగటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పరిటాల శ్రీరామ్ కూడా కమిషనర్ గా మల్లికార్జున బాధ్యతలు తీసుకుంటే కమిషనర్ కార్యాలయం నుంచి కాలర్ పట్టుకుని ఈడ్చుకొస్తా అంటూ పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.
కమిషనర్ మల్లికార్జున ను వెనకేసుకొస్తున్న సత్య కుమార్ :
మున్సిపల్ కమిషనర్ వివాదంపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన అధికారి కాబట్టే కమిషనర్ మల్లికార్జునను నియమించాం.ఆయన గతంలో ఏదో చేశాడని చెబుతున్నారు.. సరైన కారణాలు చూపలేదు. కమిషనర్ ను రాజకీయ కోణంలో చూస్తున్నట్టు కనిపిస్తోందని.. అధికారిని అధికారిగా మాత్రమే చూడాలి. ఏ ఎమ్మెల్యే ఉంటే వారికి కొద్దొ గొప్పో అనుకూలంగా చేస్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త అధికారుల్ని సృష్టించలేం. గత ప్రభుత్వంలో ఆయన తప్పిదాలు ఉంటే.. నేనే మార్చమని అడుగుతా నాకు ధర్మవరం స్వచ్ఛతగా ఉండాలనేది లక్ష్యం. ఇందుకు నేను అధికారుల మీదనే ఆధారపడాలి కదా అంటూ మంత్రి సత్య కుమార్ పేర్కొనడంతో టిడిపి నేతలు ఆగ్రహం రెట్టింపైంది.
ఈ వివాదం ఎక్కడ వరకు వెళుతుంది :
కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు ప్రభుత్వాధికార బదిలీల్లో ఈ విధంగా రోడ్డుకు ఎక్కడం ఇదే మొదటిసారి. అనంతపురం జిల్లాలో ఎంతో ప్రాబల్యం ఉన్న రాజకీయ కుటుంబాలలో పరిటాల కుటుంబం ఒకటి. గత ఎన్నికల్లో అనుకుని పరిణామాలతో ధర్మవరం నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ పోటీ చేస్తున్నరంతో అధిష్టానం మాట కాదనలేక పరిటాల శ్రీరామ్ సత్యకుమార్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అధికారం చేపట్టినప్పటికీ మేము ప్రతిపక్షంలోనే ఉన్నామా లేక అధికార పక్షంలో ఉన్నామా అన్నది తమకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని పరిటాల శ్రీరామ్ ఓ సందర్భంలో చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ వ్యవహార కాస్త అధికార పార్టీలో అలజడి రేపింది అనడంలో అతియోశక్తి లేదు. ఈ వివాదాన్ని పార్టీ అధిష్టానం ఎంత తొందరగా సర్దుమనిగీస్తే అంత మంచిదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.