Tadipatri ex MLA Kethireddy PeddaReddy asking sp to permit him to his home | తాడిపత్రి: తనను తన తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీకి విన్నవించుకున్నారు. చట్టపరంగా బెయిల్ వచ్చిన అనంతరం 15 రోజులు నా నియోజకవర్గంలోకి వెళ్లకూడదని చెప్పారు. అదేవిధంగా తాను నియోజకవర్గానికి వెళ్లకుండా ఉండాలన్న గడువు ముగిసిపోయింది అన్నారు. నా నియోజకవర్గంలోకి నన్ను వెళ్లేందుకు అనుమతించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీని కోరారు.
తాడిపత్రి నియోజకవర్గంలోకి తాను వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు చెబుతున్నారని, అనవసరంగా వదంతులు క్రియేట్ చేసి తనను సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. మా ఊర్లో మా ఇంటికి వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతి ఎందుకని కూడా ప్రశ్నించారు. విజయదశమి (Dasara 2024) తర్వాత కచ్చితంగా పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా కచ్చితంగా ఊరికి వెళ్తానని పేర్కొన్నారు. లేకుంటే నా ఊరికి వెళ్లేందుకు ఈ ప్రభుత్వంలో టిడిపి నేతుల పర్మిషన్ అవసరం అంటే చెప్పండి తాడిపత్రి ఎమ్మెల్యే పర్మిషన్ తెలుగుదేశం పార్టీ నేతల పర్మిషన్ కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు వారి సొంత నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని కేతిరెడ్డి ఆరోపించారు. ఏపీలో గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని వివరించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన మనషులే ఇసుక తోడుతున్నారని.. గంజాయి విక్రయిస్తున్నారని బహిరంగంగా చెబుతున్నారని గుర్తుచేశారు. కానీ తాడిపత్రి పోలీసులు, అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పట్టించుకోవడం లేదన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఎస్పీకి వీడియో పెట్టినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 వంద రోజులు గడిచాయి. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. వీటన్నిటికీ కాలమే నిర్ణయం చెబుతుందని ఇలాంటి దౌర్జన్యాలు ఎక్కువ రోజులు సాగవని హితవు పలికారు. విజయదశమి తరువాత కచ్చితంగా నా ఊళ్లోకి నేను వెళ్తానన్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా తన ఇంటికి వెళ్లడం మాత్రం ఖాయమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టంచేశారు. లేనిపక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నా హక్కులను కాపాడుకునేందుకు నిరసన తెలియజేయడానికైనా తాను సిద్ధం అన్నారు.