Paritala Sriram about Topudurthi Mahesh Reddy | ధర్మవరం: ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి శవమై  కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ వద్దకు చేరుకొని. మహేష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మహేష్ రెడ్డి తల్లిదండ్రులను ఓదార్చారు. యువకుడు, ధైర్యవంతుడైన మహేష్ రెడ్డి మరణం చాలా బాధాకరమని ఈ సందర్భంగా శ్రీరామ్ అన్నారు.


ప్రకాష్ రెడ్డి సోదరులు మహేష్‌ రెడ్డిని టార్గెట్ చేశారు


2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి తనను కలిశాడని.. అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారన్నారు. వారి భూములు విషయంలో లేని సమస్యలు సృష్టించి ఇబ్బందులు పెట్టారన్నారు. అక్రమంగా కేసులు పెట్టి చాలాసార్లు కొట్టారన్నారు. ఆ క్రమంలో తన పేరు చెప్పాలని ఎన్ని సార్లు ఒత్తిడి తెచ్చినా మహేష్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డారన్నారు. గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి మహేష్ రెడ్డితో అతని తండ్రికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడన్నారు. ఇందుకు ఫేస్ బుక్ లో ఉన్న కొన్ని పోస్టులే సాక్ష్యం అన్నారు. ఈ క్రమంలోనే అతను రైలు పట్టాలపై శవమై కనిపించడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.




విచారణ చేయాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి 


మహేష్ రెడ్డి మరణానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారన్నారు. కానీ పోలీసులు దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. మహేష్ రెడ్డి మరణంతో తోపుదుర్తి గ్రామం తో పాటు నియోజకవర్గంలో ప్రతి ఒక్కర్నీ  కలచివేసిందన్నారు. ప్రకాష్ రెడ్డి సోదరులు తమ సొంత గ్రామానికి చెందిన యువకునిపై ఇలా కక్ష గట్టడం దుర్మార్గమన్నారు. మహేష్ రెడ్డికి కూడా వారి పిల్లలకు ఉన్న వయసు ఉంటుందని.. వారి కళ్ల ముందే పుట్టి పెరిగాడని.. అలాంటి వ్యక్తి విషయంలో కక్ష కట్టి  వేధించడం సరైనది కాదన్నారు. ఈ విషయంలో ఎస్పీని కలుస్తామని అవసరమైతే.. ఉన్నత స్థాయిలో ఫిర్యాదు కూడా చేస్తామని శ్రీరామ్ స్పష్టం చేశారు.