వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కేసు విచారణ సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా పడింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీతా రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన కేంద్రదర్యాప్తు సంస్థ వివేక హత్య కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని రిక్వస్ట్ చేసింది. దీంతో కేసును సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ వేయడంతోపాటు దర్యాప్తునకు సంబంధించిన ఒరిజినల్ ఫైల్‌ను కూడా సీల్డ్ కవర్‌లో పెట్టి సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు కోరింది
ఈ కేసు విచారణ సందర్భంగా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుతోపాటు గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ని కూడా ఒకేసారి విచారిస్తామని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ ముందే విచారించి నిర్ణయం తీసుకోవాలని ఆయన తరఫున న్యాయవాది కోరారు. అయితే రెండు పిటిషన్లు ఒకేసారి విచారిస్తామని పేర్కొంది. ఇది హత్య కేసని... ఇందులో ప్రతి అంశంపై కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అందుకే కచ్చితంగా వేచి చూడాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.