Srisailam News: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయ ఈఓ మరో వివాదంలో చిక్కున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన... స్వామి వారిని దర్శించుకోకుండా తన అభిమాన నేతకు ఘన స్వాగతం పలికేందుకు వెళ్లారు. మల్లన్న దర్శనానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో స్వామి వారిని మరిచి రాజకీయ నాయకుడికి పెద్దపీట వేశారంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్నను దర్శించుకోకుండానే వెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. శివమాల ధరించి ధరించి మరీ మంత్రి పెద్దరెడ్డి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది చూసిన భక్తులు ఈవో తీరుపై మండిపడుతున్నారు.
మాలలో ఉండి.. స్వామివారి సన్నిధిలో రాజకీయ నాయకుడి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటంటూ శివ భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శివమాల ధరించిన ఆలయ అధికారి.. మంత్రి కాళ్లను మొక్కడం సరికాదంటూ చెబుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్న సాక్షిగా ఆలయ అధికారి లవన్న భక్తులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు.
గవర్నర్ విశ్వభుషన్ హరి చందన్ రానున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఆలయ ఈఓ లవన్న అవినీతి ఆరోపణలు, పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ క్రమంలోనే మరో వివాదంలో ఇరుక్కున్నారు. అంతేకాకుండా మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తిగా విఫలం కావడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ పాసులు అధిక సంఖ్యలో జారీ చేయడం సరికాదని చెబుతున్నారు.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
మరోవైపు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వచ్చారు. శ్రీశైలానికి సమీపంలోని సుండిపెంటలో హెలికాప్టర్ ల్యాండ్ అవగా.. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు గవర్నర్ దంపతులు. అనంతరం శ్రీశైలం భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు, ఆలయ ఈవో లవన్న, ఆలయ చైర్మన్, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని, ఎస్పీ రఘువీర్ రెడ్డి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
గవర్నర్ హరిచందన్ దంపతులు.. భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యక పూజలు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచన మండపం వద్ద ఆర్చకులు, వేదపండితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపట జ్ఞాపిక, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలను అందజేశారు.