Srisailam Mallanna Rathotsavam 2023 : భూ మండలానికి నాభి స్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మద్య భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. 
శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమోగాయి. ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించి పోయారు. ముందుగ శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లికిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు.


అరటిపండ్లను రథంపైకి విసిరిన భక్తులు
 అనంతరం శ్రీస్వామి అమ్మవార్లు  రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మద్య రథోత్సవం కదలగానే వేలాదిమంది భక్తులు ఓం నమః శివాయ నినదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అరటిపండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో 1008 శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ శివచర్య స్వామి, ఆలయ ఈవో లవన్న దంపతులు,ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.


శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి (Maha Shivaratri 2023) బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఛైర్మన్ సతీమణి స్వర్ణలత రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం దంపతులు, తిరుమల దేవస్థానం వేదపండితులు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి స్వర్ణలతా రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, తిరుమల దేవస్థానం వేదపండితులకు... శ్రీశైలం ఆలయ ఈవో ఎస్.లవన్న, చైర్మన్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు.


ఘనంగా గ్రామోత్సవం - పాల్గొన్న వేలాదిమంది భక్తులు


అనంతరం శ్రీస్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాజగోపురం గుండా మయూర వాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో ఊరేగించారు. మయూర వాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆట పాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మయూర వాహన సేవ పూజ కైంకర్యాలలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సతీమణి స్వర్ణలత రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.