Nandyala News: బెట్టింగ్‌ల‌పై ఎంత అవగాహ‌న క‌లిగించినా యువ‌త‌లో మార్పు రావ‌డం లేదు. వ్య‌స‌నాల‌కు డ‌బ్బులు అవ‌స‌రం కావ‌డంతో  ఈజీ మ‌నీ కోసం బెట్టింగుల బాట ప‌డుతున్నారు. క్రికెట్‌, జూదం, ఎల‌క్ష‌న్ బెట్టింగుల‌తో జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుని అర్థంత‌రంగా జీవితాల‌ను ముగిస్తుంటే, మ‌రికొంద‌రు త‌ల్లిదండ్రుల‌కు నెత్తిన కుంప‌టిలా మారిపోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న తాజాగా క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పున్నామ న‌ర‌కం నుంచి కాపాడాల్సిన కొడుకు, నిక్షేపంగా ఉన్న త‌ల్లిదండ్రుల పాలిట యముడ‌య్యాడు. బెట్టింగ్ వ్య‌వ‌సానికి బానిసై కొడుకు చేసిన అప్పులు చెల్లించ‌లేక త‌ల్లిదండ్రులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దాదాపు కొడుకు చేసిన రూ. 2.40 కోట్లు అప్పు తీర్చ‌డానికి త‌మ వ‌ద్ద‌నున్న 10 ఎక‌రాల పొలం, ఉంటున్న ఇంటిని అమ్మెసినా అప్పులు తీర‌క‌పోవ‌డంతో అప్పుల బాద భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. 






Also Read: పెళ్లి చేయాలన్న భయంతో కుమార్తెను చంపేసిన తండ్రి -మెదక్ జిల్లాలో దారుణం


రూ. 2.40 కోట్ల అప్పు


ఆత్మ‌కూరు స‌బ్ డివిజిన‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ రామాంజి నాయ‌క్ క‌థ‌నం ప్ర‌కారం వివ‌రాలు..  నంద్యాల జిల్లాలోని అబ్దుల్లాపురానికి చెందిన ఉమా మ‌హేశ్వ‌ర్ రెడ్డి, ప్ర‌శాంతి దంప‌తుల కుమారుడు నిఖిల్‌. కొడుకు నిఖిల్‌ను వారు బెంగ‌ళూరులో ఉంచి డిగ్రీ చ‌దివిస్తున్నారు. చ‌దువుల కోసం బెంగ‌ళూరు వెళ్లిన కుర్రాడు అక్క‌డ బెట్టింగ్ వ్య‌సనాలకు బానిస‌గా మారాడు. ముందూ వెనుక ఆలోచించ‌కుండా ఏకంగా రూ. 2.40 కోట్లు అప్పులు చేశాడు. ఈ విష‌యం త‌ల్లిదండ్రుల‌కు తెలిసి అప్పులు తీర్చ‌డానికి త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. త‌మ ప‌దెక‌రాల పొలంతోపాటు ఉంటున్న ఇంటిని కూడా అమ్మేశారు. అయినా కొడుకు  చేసిన అప్పులు తీర‌లేదు. అప్పుల ఒత్తిడి పెర‌గ‌డంతో తీర్చేదారిలేక కూల్ డ్రింక్‌లో పురుగుల మందు క‌లుపుకొని తాగి త‌ల్లిదండ్రులిద్ద‌రూ త‌నువు చాలించారు.  


బెట్టింగ్‌ల‌పై ప్ర‌భుత్వాలు ఉక్కుపాదం మోపాలి


యువ‌త‌ను టార్గెట్‌గా చేసుకుని దేశ‌వ్యాప్తంగా మోసాలు పెరిగిపోతున్నాయి. టెక్నాల‌జీని ఆస‌రాగా చేసుకుని యువ‌త‌ను ట్రాప్ చేస్తున్నారు. కొంద‌రు తెలిసో తెలియ‌కో వీటి బారిన ప‌డుతున్న‌ప్ప‌టికీ, కొంద‌రు అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్ లు, ఉద్యోగాలిప్పిస్తామ‌ని డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం, వీడియో కాలింగ్ పేరుతో హ‌నీ ట్రాపింగ్ ఉచ్చులో చిక్కుకుని జీవితాల‌ను నాశ‌నం చేస‌కుంటున్నారు. కొన్ని ఘ‌ట‌న‌లు అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌ల‌తో వెలుగుచూస్తుంటే, మ‌రికొన్ని మాత్రం ప‌రువు పోతుంద‌ని భ‌యంతో ఆస్తుల‌మ్మి అప్పులు చెల్లిస్తున్నారు. ప్ర‌భుత్వాలు ఉక్కుపాదం మోపి అరిక‌ట్ట‌క‌పోతే యువ‌త బ‌లికావ‌డ‌మే కాక త‌ల్లిదండ్రులు కూడా జీవితాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. తాజా ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం.


Also Read: మైనర్ బాలికను పరువు కోసం చంపారా? లేక ఆత్మహత్యా?