మూడు రాజధానులకు మద్ధతుగా కర్నూలులో రాయలసీమ గర్జన పేరుతో సోమవారం జరగనుంది. ఈ గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీతోపాటు వైసీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన గర్జనల కంటే జనసేమీకరణ చేయాలని చూస్తున్నారు. ఆదివారం రాత్రి దీనికి సంబంధించిన ఓ వీడియోను కొండారెడ్డి బురుజుపై ప్రదర్శించారు. దీనికి వైసీపీ లీడర్లు, జేఏసీ నేతలు హాజరయ్యారు. 


పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం నిర్వహించే రాయలసీమ గర్జనకు రాయలసీమ జేఏసీ నేతలు, వ్యాపార వేత్తలు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు హాజరుకానున్నారు. 


రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదివారం ప్రకటించారు. సీమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం నైతిక బాధ్యతని అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని దానికి ఇప్పుడు జేఏసీ పోరాడుతోందని తెలిపారు. అందుకే వైసీపీ తరఫున మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. 


అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అంశాన్ని వైసీపీ తన అజెండాగా మార్చుకుందన్నారు బుగ్గన. కానీ చంద్రబాబు మాత్రం అన్ని ప్రాంతాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పచ్చటి పంట పొలాలను కూడా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వికేంద్రీకరణకు వైసీపీ మద్దతుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖలో భారీ సభ, ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ కూడా వేరే కార్యక్రమంలో పాల్గొనటంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. పవన్ వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో పెద్ద గలాటా జరిగింది. మంత్రులపై కొందరు జనసేన కార్యకర్తలు దాడి చేయబోయారని చెప్పి పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన రద్దు చేసే వరకు పోలీసుల ఆయన్ని హోటల్‌లో నిర్బంధించారు. 


విశాఖ తర్వాత తిరుపతిలో కూడా గర్జన నిర్వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతోపాటు వివిధ ప్రాంతాల్లో రౌండ్‌ టేబుల్ సమావేశాలను కూడావైసీపీ నిర్వహిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలను మోటివేట్ చేస్తోంది. 


శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. దీని కోససం కర్నూలు బార్‌ అసోసియేషన్‌ వంద రోజులకుపైగా రిలే దీక్షలు చేసింది. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు, మానవ హారాలు చేశారు. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో జరిగే సభకు సీమ జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్జీవోలు, వ్యాపారులు తరలిరానున్నారు.