రాయదుర్గం రాజకీయాలు రంజుగా మారాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు తీవ్ర రూపం దాల్చింది. ఒకరిపై మరొకరి కేసులు పెట్టుకుంటున్నారు. ఇక్కడే పోలీసులు కూడా వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. ప్రతిపక్ష నేతలపై చెప్పకనే కేసులు పెడుతున్న పోలీసులు... అధికార పక్షనేతలపై మాత్రం  పిర్యాదులు ఇస్తున్నప్పటికీ కేసులు నమోదు చేయడం లేదు. బాధితుల తరుఫున ఆందోళన చేస్తే సుమోటోగా టిడిపి లీడర్లపై కేసులు నమోదు చేశారు. ఏ అంశం తీసుకొన్నా ఇదే పరిస్థితి నెలకొందన్న విమర్శలు ఎక్కువుతున్నాయి.


కొద్దిరోజుల క్రితం గుమ్మఘట్ట మండలం గోనబావి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కారకుడైన వైసిపి నేతపై బాధితులు పిర్యాదు ఇస్తే కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. ఐదు మంది మృతికి కారణమైన కేసులో పోలీసుల వ్యవహరించాల్సి తీరుపై టిడిపి నేతలు పోలీస్ స్టేషన్ ముందు బాధితులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో యాక్సిడెంట్‌కు కారణమైన నేతపై కేసు నమోదు చేయకుండా.. బాధితుల తరుఫున పోరాటం చేసిన మాజీమంత్రి కాలువ శ్రీనివాస్, మరో పన్నెండు మందిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. విప్ కాపు రాంచంద్రారెడ్డి , మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది.


ఏ విషయం తీసుకొన్న ఇరువురి నేతల మద్య వివాదం తీవ్రమౌతుంది. రాయదుర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు... అప్పట్లో తనపై కూడా ఇదే స్థాయిలో వేధింపులకు గురి చేశారన్నది విప్ కాపు రాంచంద్రారెడ్డి వాదన. అప్పుడు తన పార్టీ కార్యకర్తలపై కూడా అదేస్థాయిలో కేసులు పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాలువ శ్రీనివాసులవి దొంగ ఏడుపులని.. రాయదుర్గంలో ఏదో జరిగిపోతుందని కలరింగ్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకా తాము ఎలాంటి కక్ష సాధింపులకు దిగలేదని, దిగితే ఈపాటికి కాలువను అరెస్ట్ చేసి ఉండేవాళ్లమన్నారు. కేవలం శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరించడంతోనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు తప్పితే తాము ఎక్కడా ఫిర్యాదు చేయలేదన్నది కాపు రామచంద్రారెడ్డి వెర్షన్. 


కాలువ ఇదే విషయంపై మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేయకుండా తమపై కేసులు పెడుతున్నారన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే అరెస్ట్ చేసేందుకు ధైర్యం సరిపోవడం లేదనంటున్నారు. తాము ఎక్కడా ఎవర్నీ ఎప్పుడూ వేధించలేదన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు కాలువ. కావాలనే తమపై, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కాపుపై మండిపడ్డారాయన. ఇలాంటి వాటిని కచ్చితంగా గుర్తు పెట్టుకొంటున్నామని.. పోలీసులు కేసులు నమోదు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నమోదు చేయాలని సూచించారు. తమపై నమోదువుతున్న కేసులపై పోలీసులు కచ్చితంగా కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా అధికార పార్టీ వేధింపులు అధికమయ్యే ఛాన్స్‌ ఉందన్నారు కాలువ. వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్ట్లు చెప్తున్నారీ మాజీ మంత్రి. ప్రమాదం కారణంగా రాయదుర్గంలో పొలిటికల్ హీట్ మాత్రం తీవ్రస్థాయికి చేరింది. 


Also Read: ఆర్‌ఎంపీ ప్రాక్టీసనర్‌... పాలిక్లీనిక్‌ ఓనర్... కథ అక్కడే అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు


Also Read:Crime News: చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి