Anantapur Collectorate: జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునివ్వడం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తతలకు దారిదీసింది. టీడీపీ నేతలు నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా.. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు, పచ్చ చొక్కాలు కనిపిస్తే చాలు పోలీసులు వారిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలను ఆదివారం రాత్రి నుంచి గృహనిర్బంధం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వచ్చే అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తున్న వాహనాలను, వ్యక్తులను పోలీసులు నిశితంగా తనిఖీ చేసి లోపలికి పంపుతున్నారు. కలెక్టర్ కార్యాలయం వైపు వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు దారి మళ్లిస్తున్నారు.


పరిటాల సునీత, శ్రీరామ్‌లను అడ్డుకున్న పోలీసులు
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతు సమస్యలకు పరిష్కారం కోసం కలెక్టరేట్ కు వస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.  రైతుల సమస్యలపై ఆందోళన చేస్తుంటే, అధికార పార్టీ పోలీసులును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తుందంటూ పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల కోసం పోరాడుతుంటే తమను అడ్డుకున్న పోలీసుల తీరును శ్రీరామ్ తప్పుపట్టారు.


మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్​ చౌదరి గృహనిర్బంధం
ఛలో కలెక్టరేట్ పిలుపు నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని పోలీసులు అనంతపురంలో హౌస్ అరెస్ట్ చేశారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దాంతో ఆదివారం రాత్రి నుంచే టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలపాలనకుంటే కూడా పోలీసులు తమను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కకుండా వారిని గాలికొదిలేసిన ప్రభుత్వంపై అన్నదాతల కోసం పోరాడుతున్న నేతల్ని అడ్డుకోవడం సరికాదన్నారు.