చలో గొందిరెడ్డిపల్లి... అనంతపురం జిల్లాలో టెన్షన్ పుట్టిస్తున్న కార్యక్రమం. రైతు సమస్యలపై సమరం పేరుతో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇచ్చిన పిలుపు అనంత రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. పరిటాల ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఎవర్నీ బయటకు రాకుండా పికెటింగ్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. దీన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కార్యక్రమం చేపట్టే గొందిరెడ్డిపల్లి వెళ్లి నిరసన తెలపాలని టీడీపీ లీడర్లు పరిటాల సునీత, శ్రీరామ్ పిలుపునిచ్చారు. గొందిరెడ్డిపల్లిలో మీటర్లు బిగంచడమే కాకుండా ఎర్రమట్టిని కూడా తవ్వి తీస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై పోరాటానికి సిద్ధపడింది పరిటాల వర్గం.
రైతు సమస్యలు, అక్రమ మైనింగ్‌పై టిడిపి చేపట్టిన చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమం గురించి తెలుసుకున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం రోజు తలపెట్టిన ఈ కార్యక్రమానికి టిడిపి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అనంతపురంతోపాటు వెంకటాపురంలో పరిటాల కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు వచ్చి నిరసనకు వెళ్లకూడదంటూ నోటీసులు ఇచ్చారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టించడం సరైన చర్య కాదని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మాత్రమే వెళుతున్నామని ఎలాంటి ఆందోళనలు చేయడం లేదని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. అందుకే ఇంటి వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులతోపాటు అన్ని వర్గాలు మీటర్ల బిగింపు విధానాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా మొండిగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సునీత. అక్రమ మైనింగ్‌పై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు పరిటాల సునీత. ఇప్పుడు వైసీపీ నేతల ప్రోత్బలంతో తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఎలాగైనా వెళ్తామని వాళ్లంతా చెప్పడంతో పరిటాల శ్రీరామ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు, ప్రభుత్వ చర్యలపై పరిటాల వర్గం తీవ్రంగా మండిపడింది. రైతు ప్రభుత్వం అని చెబుతూనే రైతులకు ఉరి తాళ్లు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ఆలోచనలు విరమించుకున్నా రాష్ట్రం అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొందిరెడ్డిపల్లిలో అక్రమంగా ఎర్రమట్టి ఎమ్మెల్యే అనుచరులు తరలిస్తున్నా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయారని అధికారులపై ధ్వజమెత్తారు.
నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తేందుకు సిద్ధపడ్డ పరిటాల సునీతను వెంకటాపురం లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. అనంతపురంలో పరిటాల శ్రీరామ్ కు నోటీసులు జారీ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతు సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా నియంత పాలన కొనసాగుతుందని మండిపడుతున్నారు శ్రీరామ్.