AP News: ఓర్వకల్లు నోడ్‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Hyderabad Bengaluru Industrial Corridor | కర్నూలులోని ఓర్వకల్లు నోడ్ ను హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Orvakal Node in Kurnool District | అమరావతి: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు నోడ్ ను హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ (Hyderabad - Bengaluru Industrial Corridor)లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కర్నూలులోని ఓర్వకల్లు మండలంలోని 13 గ్రామాల పరిధిలో ఉన్న 9,718 ఎకరాలను ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ గా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ యాక్టు 2017 ప్రకారం హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ ను భాగం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం కీలక పరిణామంగా చెప్పవచ్చు.
2 పారిశ్రామిక కారిడార్ లతో అనుసంధానం
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ రాష్ట్రంలోని మరో రెండు ప్రధాన పారిశ్రామిక కారిడార్ లతో అనుసంధానం అయి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ తో పాటు విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ తోనూ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ కనెక్టివిటీని కలిగి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఎరో స్పేస్, నాన్ మెటాలిక్, ఫార్మా, అప్పారెల్, డిఫెన్స్, బెవరేజెస్ సహా తదితర పరిశ్రమలకు ఓర్వకల్లు నోడ్ అనువైందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
కృష్ణపట్నం పోర్టుకు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని ఏపీ ప్రభుత్వం ఆకాంక్షించింది. తాజా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌కు 37 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది.
అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేంద్రం
గత ఏడాది కేంద్ర కేబినెట్ సమావేశంలో ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్ డెవలప్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఓర్వకల్లులో వృథాగా ఉన్న వేలాది ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తామని, ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గతేడాది కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారని తెలిసిందే. ఆ మధ్య సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు పెద్ద కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.