నంద్యాల: ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ZPTC గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం నాడు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు షర్మిల. 


కాంగ్రెస్ లో చేరిన అనంతరం నంద్యాల ZPTC గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు దక్కలేదన్నారు. పార్టీకోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా లేదని వాపోయారు. వైసీపీ తనపై వైసీపీ విచక్షణా రహితంగా ప్రవర్తించినందున, పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.  కాంగ్రెస్ లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతాం, పార్టీని అధికారంలో తెస్తాం అన్నారు.


ఆదివారం వైసీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు
ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ (Hyderabad)లోని లోటస్ పాండ్ లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పిన షర్మిల ఎమ్మెల్యే ఎలిజాను కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. చింతలపూడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తనను కాదని కంభం విజయరాజుకు వైసీపీ అధినేత జగన్ టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన హస్తం గూటికి చేరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు తెలియకుండా కార్యక్రమాలు చేశారు. శిలా ఫలకాల మీద నా పేర్లు కూడా తీసేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదు. నా పార్టీ అనుకొని పని చేస్తే మోసం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.


బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే, రాత్రి ఎంపీ టికెట్
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం మార్చి 24న బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆయనకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ కి టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్, మూడోసారి మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన వరప్రసాద్.. పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. అదేరోజు రాత్రి బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో వరప్రసాద్ చోటు దక్కించుకున్నారు. గతంలో ఎంపీగా నెగ్గిన తిరుపతి ఎంపీ సీటును బీజేపీ అధిష్టానం ఆయనకు కేటాయించింది. దాంతో ఇలా ఢిల్లీకి వెళ్లి, అలా టికెట్ తెచ్చుకోవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.