Dharmavaram Assembly ticket: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలోని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే టికెట్ ఎవరికీ అన్నదానిపైన స్పష్టత రాకపోవడం ఒకటైతే రోజుకొక పేరు తెరపైకి వస్తుండడంతో నియోజకవర్గంలోని కూటమి పార్టీలు నేతలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. మొన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి నేత పరిటాల శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా పరిటాల శ్రీరామ్ టీడీపీని నడిపించారు.
మొదట టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడిన అనంతరం ధర్మవరం అసెంబ్లీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ధర్మవరంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పొత్తుల భాగంగా టికెట్ తనకే కేటాయిస్తారని జనసేన నేతలతో చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన, టిడిపి, బిజెపితో జత కట్టడంతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాలు ఒక్కసారిగా మారిపోయాయి. అదే నియోజకవర్గంలో బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ను తనకే కేటాయిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురి నేతల మాటలతో నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి క్యాడర్ అయోమయ పరిధిలో పడింది. టికెట్ ఎవరికి ఇచ్చిన నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జెండా ఎగరవేయాలని అధినేతలు భావిస్తుంటే నియోజకవర్గం లో మాత్రం ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుంది అంటూ ప్రచారం చేసుకోవడం కూటమి పార్టీలకు మరో తలనొప్పిగా మారింది. కూటమి చర్చల అనంతరం సత్యసాయి జిల్లాలో బిజెపికి ఒక పార్లమెంటు స్థానం ఒక అసెంబ్లీ స్థానాన్ని బిజెపి కోరింది. దానికి అనుగుణంగానే మొదటగా హిందూపురం పార్లమెంటు స్థానం మరియు ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి.
బిజెపి నుంచి టికెట్ కోసం ఇద్దరు పోటీ ?
మూడు పార్టీల పొత్తు అనంతరం జిల్లాలో ఒక పార్లమెంటు స్థానాన్ని ఒక అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తున్నట్లు కూటమి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొదటగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీటు కేటాయిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో హిందూపురం పార్లమెంటు స్థానాన్ని పరిపూర్ణానంద స్వామికి కేటాయిస్తున్నట్లు బిజెపిలోని సీనియర్ నేతలు కొంతమంది వెల్లడించారు. అనంతరం జరిగిన చర్చలలో కూటమినేతలు మరోసారి సీట్ల పంపకాల విషయంపై చర్చలు జరిపిన తరువాత హిందూపురం పార్లమెంటు స్థానాన్ని టిడిపికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధిని అభ్యర్థిగా ప్రకటించారు.
ప్రస్తుతం ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి పరిటాల శ్రీరామ్, జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీపడుతున్నారు. గత కొంతకాలంగా ఎవరికి వారు నియోజకవర్గంలో బల ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తైతే అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పేరు బయటికి రావడంతో అసలు ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. కూటమి అభ్యర్థిగా బిజెపికి కేటాయిస్తే ఖచ్చితంగా గోనుగుంట్ల సూర్యనారాయణకి సీటు అని అందరూ అనుకున్న తరుణంలో అదే పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేరు రావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. అసలు ధర్మవరం అసెంబ్లీ టికెట్ కూటమిలో ఎవరికి కేటాయిస్తారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.