Delhi Alipur factory Fire Accident: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలీపూర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకుని ఆ ఏరియా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అలీపూర్ ఫ్యాక్టరీ (Alipur factory) ఏరియాకు చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.


మొదట 25 వరకు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తేవాలని ప్రయత్నించారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో మరో 9 అగ్నిమాపక యంత్రాలు.. మొత్తం 34 ఫైరింజన్లను అలీపూర్ లో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవించిందని జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.







ఢిల్లీలో రెండు రోజుల్లో వరుస అగ్నిప్రమాదాలు
ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం నరేలాలోని భోర్గఢ్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భోర్గడ్‌ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఒక ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీయల్ ఏరియాలో మధ్యాహ్నం అగ్నిప్రమాదం గురించి మాకు ఆదివారం సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరని నరేలా డీఎస్‌ఐఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.