Padma Bhushan Nandamuri Balakrishna | హిందూపురం: నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూపురం (Hindupuram) ప్రజలు ఆయనకు పౌర సన్మానం చేశారు. తనకు హిందూపురం రెండో పుట్టినిల్లు అని, ఇది నందమూరి పురం అని బాలకృష్ణ అన్నారు. కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ (Sr NTR) నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సమయంలోనే పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.

50 ఏళ్లు హీరోగా చేయడం రికార్డు

హిందూపురంలో నిర్వహించిన పౌర సన్మాన సభలో బాలకృష్ణ మాట్లాడారు. తన అభిమానులు, హిందూపురం ప్రజలు కోరుకోవడంతో పద్మభూషణ్ అవార్డు దక్కింది. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉంటాయన్నారు. పద్మభూషణ్ చాలా ఆలస్యంగా వచ్చిందని చాలా మంది అన్నారు. కానీ సరైన సమయంలోనే తనను ఈ అవార్డు వరించిందన్నారు. నాన్నగారి శత జయంతి నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా ఈ అవార్డు వచ్చింది. వరుసగా మూడుసార్లు హందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించాను. 50 ఏళ్లు హీరోగా ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అన్నేళ్లు నటించినా, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. మీ ఆశీర్వాదంతోనే ఇది సాధ్యం.

నాన్నగారు చేయని పాత్రల్లో సైతం నటించా..

ఏం చూసి బాలయ్యకు పొగరు అని కొందరు అంటుంటారు. నన్ను చూసుకునే నాకు గర్వం, పొగరు. తెలియని విషయాన్ని కచ్చితంగా తెలుసుకుంటాను. నాలో ఉన్న మానవత్వం, వ్యక్తిత్వం, నిబద్ధత ఎప్పటికీ కొనసాగిస్తాను. నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవుతారని కాదు. కొందరు అలా రాజకీయాల్లోకి వచ్చి నామరూపాల్లేకుండా పోయారు. నేను వాళ్లలా కాదు. సమాజానికి బాధ్యతతో ఎంతో చేయడంతో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఆశీర్వదించారు హిందూపురం ప్రజలు. నాన్నగారు చేసిన పాత్రలతో పాటు ఆయన చేయని పాత్రలు చేశా. గౌతమీపుత్ర శాతకర్ణి ఆయన చేయాలనుకున్నారు. నా రూపంలో అది సాధ్యమైంది.

అదే నా నినాదం.. నా సంతకం..

చరిత్ర సృష్టించాలన్నా నేనే.. అది తిరగరాయాలన్నా నేనే.. అదే నా నినాదం. అదే నా సంతకం. రామాగారు నెంబర్ వన్ గా ఉండగా వరుస హిట్లు ఇచ్చారు. ఆయన చూడని పారితోషికం ఉందా. అయినా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి తెలుగుదేశం పార్టీ స్థాపించి సేవ చేశారు. ఇక్కడి నుంచి నా కొత్త ఇన్నింగ్స్ చూస్తారు. మీ అంచనాలకు అందని రీతిలో సినిమాలు చేస్తా. తెలుగు జాతిలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి. 

రామారావు గారికి భారతరత్న రావాలి. అది తెలుగు జాతి కల. త్వరలోనే అది సాధ్యమవుతుందని ఆకాంక్షిస్తున్న. అది సాధ్యమైనప్పుడే ఆయనను సరైన విధంగా గౌరవించుకోవడం అవుతుంది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లాంటి మూవీలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. హిందూపురం ప్రజలకు మంచి రోడ్లు, మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. ఇండోర్ స్టేడియం నిర్మించి తీరుతాం. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా హిందూపురాన్ని తీర్చిదిద్దుతా అన్నారు.

బాలకృష్ణ సతీమణి వసుంధర మాట్లాడుతూ.. మీ అభిమానంతో బాలకృష్ణ ఎన్నో విజయాలు సాధించారు. మా ఫ్యామిలీకి ఇలాగే ఎప్పుడూ మద్ధతు తెలిపాలని తెలుగు ప్రజలను ఆమె కోరారు.