MP Gorantla Madhav: కొద్ది రోజులుగా హిందూపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంబంధించినది అంటూ వైరల్ అవుతున్న న్యూడ్ వీడియోపైన విపరీతంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆ అంశంపై రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురానికి వస్తున్నారు. ఎంపీ మాధవ్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వీడియో వ్యవహారం బయటికి వచ్చింది. ఇలా జరిగాక తొలిసారి గోరంట్ల మాధవ్ అనంతపురానికి బయలుదేరారు.


కర్నూలులో స్వాగత ఏర్పాట్లు
అనంతపురం వెళ్లేందుకు ఎంపీ ఈ ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో కర్నూలుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు ఘన స్వాగతం పలికారు. రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు కురుబ సంఘాల ప్రతినిధులు కూడా కలుసుకున్నారు. ఆయనకు మద్దతును ప్రకటించారు. ఆ సందర్భంగా కర్నూలులో గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. 


ఈ సందర్భంగా టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. వైరల్ అవుతున్న న్యూడ్ వీడియోను టీడీపీ నేతలు అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్టు చేయించిన వేళ.. గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆడియోను అమెరికా ల్యాబ్‌లో పరీక్షించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. నోటుకు ఓటు ఆడియోను ఫేక్ అని నిరూపించగలరా? అని ఛాలెంజ్ చేశారు. బీసీలను అణగదొక్కాలనే కుట్రతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. బీసీ నాయకులను టీడీపీలో చోటు లేదని, చులకనగా చూస్తారని అన్నారు. గంజి చిరంజీవి రాజీనామా ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు.


అయితే, మీడియా కూడా ఈ వార్తల పట్ల సంయమనం పాటించాలని సూచించారు. తాను కూడా చంద్రబాబు, లోకేష్ వీడియోలు మార్ఫింగ్ చేసి ఇస్తానని వాటిని కూడా తన వీడియో తరహాలో ప్రసారం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ వైరల్ వీడియోకి సంబంధించి ఒరిజినల్ వీడియో తన వద్దే ఉందని, పోలీసులు అడిగితే ఇస్తానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. నకిలీ వీడియోను అడ్డంగా పెట్టుకుని టీడీపీ డ్రామాలాడుతోందని, క్రమంగా డ్రామా పార్టీగా మారిపోతోందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోనే ఒరిజినల్‌గా అమెరికా ల్యాబొరేటరి తేల్చిందంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శించారు.


బైక్ ర్యాలీకి సన్నాహాలు, పోలీసులు షాక్
మొత్తానికి సొంత జిల్లాకి వస్తున్న ఎంపీ గోరంట్లకు భారీగా ఆహ్వానం పలికేందుకు కురుబ సామాజిక వర్గం నేతలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధం అయ్యారు. పెద్ద ఎత్తున వెహికల్స్‌తో ర్యాలీ చేపట్టేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. అదేవిధంగా అనంతపురంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.


ఇప్పటికే చంద్ర దండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు అందించారు. అనంతపురం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి రమణకు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేశారు.