కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసులు కొత్త లుక్‌లో కనిపించనున్నారు. కౌబాయ్‌ టోపీ, కూల్‌ గాగుల్స్‌, రిలాక్ష్ చైర్‌ ఇలా లేటెస్ట్‌ కిట్‌తో విధులు నిర్వహించనున్నారు. జిల్లా ఎస్‌పీ సిద్దార్థ్‌  కౌశల్‌ ఈ పర్సనల్‌ కిట్స్‌ను సిబ్బందికి అందజేశారు. 


సిబ్బందికి పర్సనల్‌ కిట్స్‌ అందజేసిన సందర్భంగా మాట్లాడిన సిద్దార్థ్‌ కౌశల్‌ కర్నూలు జిల్లాను సేఫ్ సిటిగా తీర్చుదిద్దుతామన్నారు. జిల్లా ప్రజలకు భద్రతను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్న కర్నూలు ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక పర్సనల్ కిట్ అందజేసినట్టు వివరించారు. ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని  నగరంలోని  కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఏర్పాటు చేశారు.
 
రాబోయే రోజుల్లో కర్నూలులో సిసి కెమెరాలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు సిద్ధార్థ కౌశల్. ప్రజల సహాకారం కూడా తీసుకుంటామన్నారు. మహానగరాల్లో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులను స్టడీ చేసి వారితోపాటుగా కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆధునిక అధిక నాణ్యత కలిగిన పోలీసు కిట్స్‌ను అందజేశామన్నారు. నగరంలో ప్రస్తుతం 64 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ సమస్యగా మారిందని గ్రహించి.. సిబ్బంది సంఖ్యను 120కి పెంచినట్టు తెలిపారు ఎస్పీ.


వాహనదారులకు హెచ్చరిక!


కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి  34ట్రాఫిక్ పాయింట్లు,  ముఖ్యమైన జంక్షన్‌లలో  హై పవర్ లౌడ్ స్పీకర్లును ఏర్పాటు చేశామన్నారు సిద్ధార్థ. ట్రాఫిక్ నిబంధనలు తెలియజేయడంతోపాటు, ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేవిధంగా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించామన్నారు. కర్నూలు, శివారు ప్రాంతాలలో అభద్రతా భావం ఉండే ప్రాంతాలలో పోలీసు పెట్రోలింగ్ పెంచారు. క్రైమ్ హాట్ స్పాట్స్ లో  పెట్రోలింగ్ మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రజల సంరక్షణకు, మంచి సేవలందించే విధంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. 


ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు


వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కర్నూలు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఎప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువగా వెళ్లే విధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.  ఎస్పీ. రోజురోజుకు విస్తరిస్తున్న నగరం, జనాభాతోపాటు వాహనదారుల సంఖ్య కూడా పెరుగుతుందని అందుకు తగినట్టుగానే ప్లాన్లు వేస్తున్నట్టు వివరించారు. 


ప్రజలు చేసేది అది ఒక్కటే


క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వారి ఆరోగ్యం సక్రంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పర్సనల్ కిట్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు సిద్ధార్థ. నగరం నాలుగు మూలలు నిత్యం ట్రాఫిక్‌తో నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. పది నిమిషాలు ట్రాఫిక్‌లో జనం ఇబ్బంది పడుతుంటారని... అలాంటిది ఆరేడు గంటల పాటు సిబ్బంది ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. అందుకే ప్రజలకు కూడా ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సూచించారు ఎస్పీ. రోడ్డుపైకి వచ్చిన వారంతా రూల్స్ పాటించినట్టైతే అసలు ట్రాఫిక్ సమస్యే ఉండదన్నారు. రూల్స్ పాటించి తమకు సహరించాలని ప్రజలకు సూచించారు ఎస్పీ సిద్దార్థ కౌశల్.