Kurnool Medical College News: కర్నూలు: ఇప్పటికే ఏపీలో గంజాయి అంశంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు అధికారపార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP)పై విమర్శలు కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే కాలేజీలకు గంజాయి కల్చర్ పాకిందని, వైసీపీ నేతలు దీన్ని వెనకుండి నడిపిస్తున్నారని టీడీపీ (TDP) నేతలు పలుమార్లు ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి (Ganja)కి బానిసై విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాల మత్తులో ఒంగోలులో జరిగిన గ్యాంగ్ వార్ ఘటన జరిగి రెండు రోజులు అవ్వకముందే కర్నూలు జిల్లా మెడికల్ కళాశాల Kurnool Medical College()లో గంజాయి కలకలం రేపింది.
మెడికల్ కాలేజ్ మెన్స్ హాస్టల్ లో విద్యార్థులు మాదకద్రవ్యాలను తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో హాస్టల్ డిప్యూటీ వార్డెన్ అసిస్టెంట్ వార్డెన్ లో అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తరుణంలో ఒక గదిలో నలుగురు వైద్య విద్యార్థులు మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ వారి కంటపడ్డారు. వారిలో ఇద్దరు విద్యార్థులు ప్రధానంగా ఉన్నట్లు తెలిపారు. గంజాయిని పొడిచేసి దాన్ని పొగరుగంలో తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మెడికల్ కళాశాలలో గంజాయి సేవిస్తున్నట్లు నిరూపణ కావడంతో విద్యార్థులతో తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం అందించారు. తల్లిదండ్రులకు వారి పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ముగ్గురితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా గంజాయి మెడికల్ కళాశాలకి ఎలా వచ్చింది? ఎవరు సప్లై చేస్తున్నారు ఇంకా కళాశాలలో ఎంత మంది గంజాయికి బానిస అవుతున్నారు అని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటనలో వివరాలిలా..
కర్నూలు వైద్య కళాశాల మెన్స్ మెడికల్ హాస్టల్ వార్డెన్ ఆకస్మిక తనిఖీలో భాగంగా ఇద్దరు వైద్య విద్యార్థులు మత్తు పద్మాలు సేవిస్తూ పట్టుబడ్డారు. దాంతో త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం ఒక విద్యార్థి గత కొంత కాలంగ మత్తుమందు బానిస అయినట్లు గుర్తించాం. మరో విద్యార్థి (స్థానికుడు) కూడా మత్తు మందు సేవిస్తున్నాట్లు గుర్తించాం. త్రిసభ్య కమిటీ విచారణలో భాగంగా వీరు మరో ముగ్గురు సహ విద్యార్థులు కూడా గతంలో వీరితో కలిసి మత్తు మందు సేవించినట్లు తెలిపారు. మరికొంత మంది విద్యార్థులు కాలేజీ హాస్టల్ లో మద్యం సేవించినట్లు వార్డెన్లు గుర్తించారు.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మత్తు పదార్థాలు సేవిస్తున్నారన్న అభియోగం ఎదుర్కొంటున్న నలుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించాం. మద్యం సేవిస్తున్నట్లు అభియోగం ఉన్న ఐదుగురు విద్యార్థులను 6 నెలలపాటు హాస్టల్ నుంచి తొలగించాం. దీనిపై సమగ్ర విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాం. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కోరారు.
క్లాస్ రూంలోనే విద్యార్థుల గొడవ..
ఒంగోలు మెడికల్ కాలేజీ విద్యార్థులు కొందరు మత్తుకు బానిసయ్యారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వ్యసనాలకు బానిసై ఇతరులను వేధిస్తున్నారనే కారణంతో ఈ ఆగస్టులో 8 మంది విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల సస్పెన్షన్ ముగిసిన తరువాత వచ్చిన విద్యార్థులు తమపై ఫిర్యాదు చేశారనే అక్కసుతో కొందరు విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని గొడవ పడ్డారు. క్లాస్ రూమ్ లోనే విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు.