Kadapa Latest News: కడప రాజకీయంలో అధికారులు నలిగిపోతున్నారు. కడప మేయర్‌, ఎమ్మెల్యే మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు ఉద్యోగులవైపు తిరిగింది. తాను పెట్టిన మీటింగ్‌కు రాలేదని కమిషనర్ సహా మున్సిపల్ సిబ్బందికి మేయర్ నోటీసులు ఇచ్చారు. సమావేశానికి ఎందుకు రాలేద వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. 

కడప మున్సిపల్‌ కమిషనర్‌ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. దీని కారణంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. మేయర్‌పై అవిశ్వాసం కూడా పెట్టారు. ఆయనపై అనర్హత వేటు కూడ వేశారు. కోర్టులకు వెళ్లి అన్నింటిపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ వేయకుండా అవమానించారని టీడీపీ చెబుతోంది. అప్పటి నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు ఇందులోకి అధికారులు కూడా చేరిపోయారు.    తాజాగా కడప మున్సిపల్‌ కమిషనర్‌ సహా ఏడుగురు ఉద్యోగులకు మేయర్ సురేష్‌ బాబు షోకాజ్‌ నోటీసులు అందజేశారు. విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎందుకు సమావేశానికి రాలేదు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

ఆరు నెలలుగా కడప మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. దీంతో  రూల్స్ ప్రకారం మున్సిపల్‌ పాలక మండలి రద్దు అయ్యే ప్రమాదంలో పడింది. అందుకే శుక్రవారం సురేష్‌బాబు సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమావేశం ఏర్పాటు చేశారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.  

ఈ సమావేశానికి కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మేయర్ సురేష్‌బాబుతోపాటు, వైసీపీ కార్పొరేటర్లు అక్కడకు రాలేదు. ఎమ్మెల్యేతోపాటు టీడీపీ కార్పొరేటర్లు, అధికారులు చాలా టైం ఎదురు చూశారు. కానీ అక్కడకు మేయర్‌, మిగతా కార్పొరేటర్లు రాకపోవడంతో తాళాలు వేసి వెళ్లిపోయారు. 

అయితే మేయర్‌ మాత్రం తన ఛాంబర్‌లోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి అజెండాను చదివి వినిపించారు. అనంతరం  కడప కమిషనర్‌ మనోజ్‌రెడ్డి, అదనపు కమిషనర్‌ రాకేశ్‌చంద్రం, ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి సహకరించడం లేదని తీర్మానం చేశారు. వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇలా ఓవైపు ఎమ్మెల్, మరోవైపు కమిషనర్‌ మధ్య సాగుతున్న రాజకీయక్రీడలో తామంతా పావులుగా మారుతున్నామని అధికారులు వాపోతున్నారు. అయితే కోరం లేని కారణంగా శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దు అయిందని అధికారికంగా ఆరు నెలలుగా సమావేశాలు జరగలేదని అంటున్నారు. మేయర్ నిర్వహించిన సమావేశం అధికారికమైంది కాదని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఇంకా ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న ఆసక్తి నెలకొంది.