Just In





Gorantla Madhav: మరో వివాదంలో గోరంట్ల మాధవ్- నిన్న పోలీసుల నోటీసులు, మాజీ ఎంపీపై తాజాగా మరో ఫిర్యాదు
Andhra Pradesh News | మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న విజయవాడ పోలీసుల నోటీసులు ఇవ్వగా, ఆయన చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీపై తాజాగా మరో ఫిర్యాదు వచ్చింది.

Anantapur News Today | అనంతపురం: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న విజయవాడ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న గోరంట్ల మాధవ్ రాష్ట్రంలో అంతర్యుద్ధం రానుందంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం మొదలైంది. గోరంట్ల వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై వారు శుక్రవారం నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన టిడిపి, జనసేన నాయకులు గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను అందజేశారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం రానుందంటే కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గోరంట్ల మాధవ్ తో పాటు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి.. వ్యక్తులు, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే గోరంట్ల మాధవ్ ని అరెస్టు చేసి విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లాకు పట్టిన చీడపురుగు లాంటి వ్యక్తి అని టీడీపీ, జనసేన నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ కాదు కదా ఆయన్ని గెలిపించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి వచ్చి ఎన్ని కుట్రలు పన్నినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. మరోవైపు టిడిపి నాయకులు మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే జిల్లా నుంచి తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చారు.