No quota for Andhra students: తెలంగాణలో ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ఇప్పటివరకు అమలవుతున్న 15 శాతం నాన్ లోకల్ కోటా(అన్ రిజర్వుడ్)లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులే పొందనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫిబ్రవరి 27న అధికారిక ఉత్తర్వులు (జీవో నెం. 15) విడుదల చేసింది. దీంతో ఇక నుంచి ఏపీ విద్యార్థులు ఆ సీట్లకు పోటీపడటానికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు అయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత, 15 శాతం నాన్ లోకల్ కోటాకి అర్హులు ఎవరు అనే దానిపై స్పష్టత ఇస్తూ.. గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం ఈ మేరకు సవరించింది. 

వృత్తివిద్యా కోర్సుల్లో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించింది. 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్ల కేటాయింపులో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. 15 శాతం సీట్లకు 4 రకాల వారిని అర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా 15 శాతం అన్‌ రిజర్వ్‌డ్‌ సీట్లకు అర్హులని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇతర రాష్ర్టాల్లో చదివిన వారు రాష్ట్రంలో పదేళ్లు చదివి ఉండాలని నిబంధన పెట్టింది. కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలూ 15 శాతం సీట్లకు అర్హులని తెలిపింది.

ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఫార్మసీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ఈ కోటాను వర్తింపజేయనున్నారు. అయితే ఈఏపీ సెట్‌కు ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉండగా.. జీవో జారీ ఆలస్యం కావడంతో ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా జీవో వెలువడటంతో మార్చి 1 నుంచి ఈఏపీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం..గతంలో ఉన్నట్లుగానే కన్వీనర్ కోటా 70 శాతం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు...అంటే ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ (తెలంగాణ రాష్ట్ర పరిధి) అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఇక మిగిలిన 15 శాతం స్థానికేతర కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74లో ఆ కోటాకు ఓయూ రీజియన్‌తోపాటు ఆంధ్రా వర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ(SKU) వారు పోటీ పడవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తాజాగా విడుదల చేసిన జీవోలో ఏయూ, ఎస్‌కేయూలను తొలగించింది. అంటే ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం కల్పించింది. 

వీరు మాత్రమే అర్హులు... ➥ అన్ రిజర్వుడ్‌గా పిలిచే స్థానికేతర కోటా 15 శాతానికి రాష్ట్రంలో చదివిన పిల్లలతోపాటు...గతంలో మాదిరిగానే మరో మూడు కేటగిరీల వారూ పోటీపడొచ్చు.

➥ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా...గతంలో పదేళ్లపాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీపడొచ్చు. అంటే రాష్ట్రంలో పదేళ్లపాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాలి. 

➥ ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు అర్హులు. 

➥ రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులు. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే... వారి భాగస్వామి (భార్య లేదా భర్త) కూడా అర్హులు.

ఏ కోర్సులకు నిబంధనలు వర్తింపు... ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా-డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్‌తోపాటు పీజీ సీట్ల భర్తీకీ ఇవే నిబంధనలు ఉంటాయి. 

స్థానికతకు ఈ అంశాలు పరిగణనలోకి ... ➥ తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా 6 నుంచి ఇంటర్(12 తరగతి వరకు) చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సులకు తొలుత 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ల చదువును చూస్తారు. 

➥ 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదవకుంటే...అప్పుడు 6 నుంచి ఇంటర్ వరకు... ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు రాష్ట్రంలో చదవాలి. అంటే 6 నుంచి 9వ తరగతి వరకు (లేదా) 7 నుంచి 10వ తరగతి వరకు చదివినా స్థానికుడిగా పరిగణిస్తారు. 

తొలుత భర్తీ చేసేది 15 శాతం కోటా సీట్లే..ఇంజినీరింగ్, ఇతర కోర్సుల సీట్ల భర్తీ సమయంలో కన్వీనర్ కోటాలో తొలుత 15 శాతం అన్ రిజర్వుడ్(నాన్ లోకల్) సీట్లను భర్తీ చేస్తారు. దానికి కూడా సామాజికవర్గాల రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ తర్వాత 85 శాతం స్థానిక కోటా సీట్లను భర్తీ చేస్తారు. 

పెరగనున్న సీట్ల సంఖ్య.. స్థానికేతర కోటా సీట్లను తెలంగాణవాసులకే కేటాయించడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో అదనంగా సుమారు 3 వేల సీట్లు అందుబాటులోకి వచ్చినట్లేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది వరకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఉండగా ఆ కోటా కింద ఉండే సుమారు 12 వేల సీట్లలో 3 వేల వరకు వారు మెరిట్ ఆధారంగా పొందేవారు.

ఎన్నారై కోటా కాలేజీల పెంపు..రాష్ట్రంలోని 15 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఎన్నారై కోటా సీట్లకు అనుమతి ఉండగా వాటి సంఖ్యను 32కు పెంచుతూ ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం 32 కాలేజీల జాబితాను విడుదల చేసింది. ఎన్నారై కోటాలో 15 శాతం సీట్లను ఆయా కాలేజీలు భర్తీ చేసుకునే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..