Paritala Sriram gives clarity over differences with Minister Satyakumar | ధర్మవరం : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమిలో విభేదాలు అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం కూటమిలో ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. పరిటాల శ్రీరామ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జున్‌కు సంబంధం ఉందని, ఈ అంశాన్ని బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.


‘గతంలో జరిగిన అన్ని అంశాలను పరిశీలిస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ధర్మవరంలో మా మూడు పార్టీలు కలిసే ఉన్నాం. ఏపీ ఎన్నికల ముందు ఎలా ఉన్నామో.. ఇప్పుడు అలానే ఉన్నాం. ఎక్కడైనా మొదటి 6 నెలలు చిన్న చిన్న సంఘటలు జరుగుతుంటాయి. అధికారులు, నాయకులు అంతా సెట్ అయ్యాక అన్నిచోట్లా పనులు జరుగుతాయి. ధర్మవరం నియోజకవర్గం గురించి ఇప్పటికే సత్యకుమార్ దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్లాం. మంత్రి సత్యకుమార్ కచ్చితంగా ఈ ప్రాంతానికి ప్లస్ అవుతారు. గతంలో భూకబ్జాలు, అనేక అక్రమాలు ఇక్కడ జరిగాయి. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధే మాకు ముఖ్యం. ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని’ పరిటాల శ్రీరామ్ చెప్పుకొచ్చారు. 


అసలేం జరిగిందంటే..
ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్య కుమార్ కాన్వాయ్ ని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయిని .. ధర్మవరంలో టీడీపీ వర్సెస్ బీజేపీ అని ప్రచారం జరిగింది. టీడీపీ కార్యకర్తలు మంత్రి సత్యకుమార్ కాన్వాయిని అడ్డుకోవడానికి బలమైన కారణం ఉంది. ధర్మవరంలో బిజెపి ఆఫీసు ఎదురుగా టిడిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునను నియమించవద్దనేది వారి డిమాండ్. గతంలో వైసీపీ హయాంలో మల్లికార్జున కారణంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా తీసుకురావడం సరికాదని టీడీపీ అంటోంది. 


Also Read: Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్ 


సత్యకుమార్ గెలుపులో పరిటాల శ్రీరామ్ కీలకపాత్ర
ధర్మవరంలో టికెట్ పరిటాల శ్రీరామ్ కు రావాల్సి ఉంది. అయితే కూటమిలో బీజేపీ చేరడంతో పొత్తులో భాగంగా సత్యకుమార్ కు ధర్మవరం అసెంబ్లీ టికెట్ దక్కింది. టీడీపీ ఇంఛార్జ్ అయిన పరిటాల శ్రీరామ్ కూటమిని గెలిపిస్తామని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్లుగానే ధర్మవరంలో టీడీపీ అండగా ఉంది సత్యకుమార్ ను గెలిపించారు. అనంతరం ఏపీ కేబినెట్ లో సత్యకుమార్ చోటు దక్కించుకున్నారు. నోటా కంటే తక్కువ సీట్లు వచ్చిన బీజేపీని మరుసటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారంటే టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సహకారమే కారణం. కానీ తమను ఇబ్బందిపెట్టిన వ్యక్తికి పదవి ఇవ్వడం సరికాదని పరిటాల శ్రీరామ్ ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.


Also Read: Manchu Vishnu: ప్రకాశ్​రాజ్‌ను ఎంతగానో గౌరవిస్తా, కానీ ఆచీతూచీ మాట్లాడక తప్పదు- మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు