Actor Suman comments on Tirumala Laddu Ghee adulteration | అనంతపురం: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీపై టాలీవుడ్ నటుడు సుమన్ సంచల వ్యాఖ్యలు చేశారు. మరికొందరు సినీనటుల మాదిరిగా తిరుమల వివాదంపై స్పందించడానికి నటుడు సుమన్ వెనుకాడలేదు. కొందరిలా మౌనంగా ఉండకుండా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. తిరుమల లడ్డూ చాలా ముఖ్యం అన్నారు. ఇతర ప్రార్థనా స్థలాలు చర్చి, దర్గలలో ప్రసాదాలు లాంటివి ఏదైనా ఒకటి ఇస్తుంటారు. అయితే తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం దారుణమైన చర్య అన్నారు. ముస్లిం అయినా, క్రైస్తవులు, ఇతర ఏ మతం అయినా వారికి పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ జరగడం మంచిది కాదన్నారు.


టీటీడీ బోర్డు, అధికారులు ఏం చేస్తున్నారు


తిరుమలకు కల్తీ నెయ్యి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. టీటీడీలో బోర్డు మెంబర్లు, అధికారులు దీనిపై ఏం చేస్తున్నారని నటుడు సుమన్ ప్రశ్నించారు. కొందరు నెయ్యి కల్తీ జరిగిందని, దాన్ని ప్రసాదాల తయారీలో వినియోగించారని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారు. ట్యాంకర్ రాగానే చెకింగ్ ఉంటుందని విన్నాను. మరి చెకింగ్ జరిగినా ఇలా కల్తీ ఉందని ఎలా తేలుతుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలి నటుడు సుమన్ డిమాండ్ చేశారు. ఎందుకంటే ఒక్కసారి అనుమానం వచ్చిందంటే, ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు.


ఓ ఆఫీసులో ఒకరు తప్పు చేస్తే, అందరూ తప్పు చేశారని అంటారు. ఒక్కరి వల్ల తిరుమలకు, స్వామివారికి అప్రతిష్ట కలుగుతుంది. తిరుమలలో ఇలాంటివి జరగడం తప్పు. భక్తి, దేవుడి ప్రసాదంలో ఇలాంటివి జరగకూడదు. అందులోనూ నేను శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్ర పోషించాను. ఎన్నో ప్రాంతాలకు లడ్డూ కొరియర్ లో వెళుతోంది. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ అంటే ఎంతో భక్తి. అందరికీ చాలా ఇష్టమైన ప్రసాదం. సెంటిమెంట్ ఉన్న లడ్డూపై వివాదం నడుస్తోంది. అన్ని మతాలలో ఇలాంటివి తప్పు జరగకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని సూచించారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే 2 సంవత్సరాలు జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కల్తీ వ్యవహారంలో జాగ్రత్తగా నిజానిజాలు తేల్చి.. దోషులను ఉగ్రవాదులు లాగా శిక్షించాలన్నారు. 


డిక్లరేషన్‌లో చెప్పింది నిజమని ఎవరికి తెలుసు


టీటీడీ బోర్డు ఉన్నా ఈ తప్పు ఎలా జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తేల్చాలన్నారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రాలలో పార్టీలకు సంబంధం లేకుండా.. దేవుడిపై భక్తి ఉన్నవారిని నియమించాలన్నారు. అన్య మతస్తులకు టీటీడీలో గానీ, తిరుమలలోగానీ పదవులు ఇవ్వకూడదని సూచించారు. జగన్ డిక్లరేషన్ పై సుమన్ ను మీడియా అడగగా.. అది ఆ వ్యక్తులపై, వారి మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే డిక్లరేషన్ లో చెప్పింది నిజమో కాదో ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. దేవుడిపై పూర్తి నమ్మకం ఉన్నవారిని, హిందువులను మాత్రమే తిరుమలలో, టీటీడీలో అవకాశం ఇవ్వడం సరైందన్నారు. ఏ మతం అయినా తప్పు జరగకూడదన్నారు. తనకు హిందువులే కాదు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలవారు సినిమాకు సంబంధించిన మొత్తం యూనిట్ సహకారంతో సుమన్ అనే నటుడు ఉన్నాడని పేర్కొన్నారు.


Also Read: Manchu Vishnu: ప్రకాశ్​రాజ్‌ను ఎంతగానో గౌరవిస్తా, కానీ ఆచీతూచీ మాట్లాడక తప్పదు- మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు