Galeru Nagari Sujala Sravanthi Project: కరువు సీమ రాయలసీమ కళకళలాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టంది. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం (Galeru Nagari Sujala Sravanthi Project)లో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం (Owk Second Tunnel) పనులను ప్రభుత్వం అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి (Chief Minister) వైస్ జగన్ (YS Jagan Mohan Reddy) గురువారం దానిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు – నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది.
వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించగా చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు ఖర్చు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను పూర్తి చేశారు. అంతే కాదు 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేశారు. ఇందు కోసం ఏకంగా రూ.934 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మూడు టన్నెళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,501.94 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది.
2.60 లక్షలకు సాగునీరు
శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించేలా ప్రభుత్వం పనులు చేపట్టింది. దీని ద్వారా ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం కలుగుతుంది. దివంగత సీఎం వైఎస్సార్ 2005లో గాలేరు – నగరి సుజల స్రవంతిని చేపట్టారు.
గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు.
అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్‌లో పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులను జగన్ ప్రభుత్వంం పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేసింది. ఫలితంగా రెండు సొరంగాల ద్వారా 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చు.
త్వరలోనే మూడో టన్నెల్ పూర్తి
శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రెండు టన్నెళ్లను పూర్తి అవగా మూడో టన్నెల్ కూడా పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది.