Somireddy Chandramohan Reddy:   ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు...ఇంటర్నేషనల్  అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ిడ ఆరోపించారు.  లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదు..రూ.10 వేల కోట్లకు పైనే ఉందన్నారు.  అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి వేల కోట్లు దోచేశారన్నారు.  కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచేయడంతో పాటు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారిపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  లిక్కర్ వ్యవహారంలో  రూ.1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడా లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.  అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను అనుమతించలేద్నారు.  ఓ వైపు ప్రధానమంత్రి మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ రెడ్డి మాత్రం క్యాష్ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారన్నారు.  ప్రస్తుతం విచారణ సాగిస్తున్న సిట్ మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందని..  రూ.3200 కోట్ల కుంభకోణం అంటున్నారు...అనఫిషియల్ సేల్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.  వేల కోట్ల అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగితే ఈడీ, సీబీఐ ఎందుకు రంగంలో దిగడం లేదని ప్రశ్నించారు.  రూ.1.30 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదని.. ప్రశ్నించారు. 

ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆషామాషీ కేసు కాదన్నారు.  కరోనా సమయంలో 2020 మార్చి 23న లాక్ డౌన్ విధించారు. మే 4న మద్యం దుకాణాలను రీ ఓపెనింగ్ చేశారు..ఆ 42 రోజులు మాత్రమే మద్యం విక్రయాలు ఆగాయి.  కానీ లక్షల క్రేట్ల మద్యం విక్రయాలు తగ్గిపోయినట్లు లెక్క చూపారన్నారు.  జగన్ రెడ్డి పర్యవేక్షణలో నడిచిన కసిరెడ్డి అండ్ టీం ఎక్సైజ్ డిపార్టుమెంటులోని మద్యం డిపోలకు వెళ్లకుండా, స్కానింగ్ కాకుండా డిస్టలరీల నుంచి నేరుగా దుకాణాలకు స్టాక్ తరలించి అక్రమంగా అమ్మేసుకున్నారని ఆరోపించారు. ఎస్పీవై ఇండస్ట్రీ మిథున్ రెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయిందని  సజ్జల శ్రీధర్ రెడ్డి నాకు అప్పుడే చెప్పారనని తెలిపారు.  

వైసీపీ ప్రత్యేకంగా ప్రోత్సహించిన ఆంధ్రా గోల్డ్, 9 సీ హార్సెస్, సిల్వర్ స్ట్రైప్ విస్కీలలో ప్రమాదకరమైన  పైరోగలాల్,  ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ టాలెట్ ఉన్నాయని  తేలిందని  ఇవి తాగితే శరీరంలోని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతారని స్పష్టంగా నివేదిక ఇచ్చారన్నారు.  అప్పట్లో నేను మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి మద్యం విక్రయాల్లో భారీ స్కామ్ జరుగుతోందని చెప్పాను.  కానీ అప్పటి ప్రభుత్వం మా మాటలు పట్టించుకోలేదు. తమకు డబ్బుంటే చాలనే లెక్కలో ముందుకెళ్లారు.  అసలు మనుషుల ప్రాణాలు తీసే హక్కు వీళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.  పహల్గామ్ లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే ప్రపంచమంతా చలించిపోతోంది .. ఏపీలో కల్తీ మద్యం తాగి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది మంచాన పడ్డారన్నారు.  ఢిల్లీలో రూ.100 కోట్ల ఆరోపణలకు సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసింది.  ఏపీలో రూ.10 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి.   ఇక్కడ రెండు రకాలుగా విచారణ జరగాల్సివుంది..అది సిట్ లెవల్ లోనే తేలిపోతుందా..లేక ఈడీ, సీబీఐ ఎంటరవుతాయో చూడాల్సి ఉందన్నారు.  కమీషన్లతో వేల కోట్లు దోచుకోవడంతో పాటు అనధికారిక సేల్స్ ఒకటైతే, నాసిరకమైన మందు ఇచ్చి ప్రజలు ప్రాణాలను తీసుకోవడం రెండో నేరమన్నారు.   బ్రాండ్ ను బట్టి క్రేట్(48 బాటిల్స్) కు రూ.150 నుంచి రూ.600 చొప్పున కమీషన్ వసూలు చేశారు  అనఫిషియల్ సేల్ తో ఒక్కో క్రేట్ కు రూ.10 వేల వరకు ఆర్జించారన్నారు.  ఈ కేసులో ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలి... వేల కోట్లు ఏ కుటుంబం చేతుల్లోకి వెళ్లాయి.. ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల్లోని అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది, ఏ కుటుంబం దురాశ కారణంగా అమాయకులు మంచాలపాలయ్యారో తేలాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.  

ఏ ప్రభుత్వంలో అయినా పొరపాట్లు జరుతాయి..వైసీపీలో జరిగినన్ని పాపాలు, నేరాలు ఘోరాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు.  మరోవైపు కసిరెడ్డి తనకు తెలియకుండా అదనంగా రూ.2 వేల కోట్లు ఎత్తేశాడని యల్లహంక ప్యాలెస్ లో కూర్చుని జగన్ రెడ్డి బాధపడిపోతున్నాడని సెటైర్ వేశారు.