Clash between Nandyal TDP MP vs Srisailam MLA | ఆత్మకూరు: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని ఆయన అనుచరులు ఎంపీ శబరిని అడ్డుకున్నారు. దాంతో శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా పరిస్థితి మారింది. ఆత్మకూరులోని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు రాళ్లదాడికి పాల్పడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి.. మాజీ మంత్రిని ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు. 

ఆత్మకూరులో బైరెడ్డి శబరిని అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు

‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం నాడు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో పర్యటిస్తున్నారు. అయితే నియోజకవర్గానికి వచ్చే ముందు ఎమ్మెల్యేకు కనీసం సమాచారం అందించాలని, కార్యక్రమాలలో ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు బైరెడ్డి శబరిని గట్టిగా నిలదీశారు. లోక్‌సభ ఎంపీగా నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడికైనా తాను వెళ్తానని, పర్యటించే హక్కు తనకు ఉందని బైరెడ్డి శబరి అన్నారు. ఈ క్రమంలో ఎంపీ అనుచరులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య నెలకొన్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో బైరెడ్డి శబరి అక్కడి నుంచి వెనుదిరిగారు. 

పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ నంద్యాల ఎమ్మెల్యే..

గ‌తంలో నంద్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలిగా చేసిన బైరెడ్డి శబరి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. నంద్యాల ఎంపీ సీటును దక్కించుకున్న ఆమె లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆమెకు సొంత పార్టీలోనే సహకారం లభించడం లేదు. నంద్యాల లోక్‌సభ పరిధిలో 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ లోక్‌సభ పరిధిలో నంద్యాల‌, పాణ్యం, బ‌న‌గాన‌ప‌ల్లె, శ్రీ‌శైలం, ఆళ్లగడ్డ, డోన్‌, నందికొట్కూరు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. కేవలం నంద్యాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఫ‌రూక్‌ మాత్రమే ఎంపీ బైరెడ్డి శబరితో స‌త్సంబంధాలు కలిగి ఉన్నారు. మిగతా ఏ నియోజకవర్గానికి వెళ్లినా పరిస్థితి ఎంపీ బైరెడ్డి శబరి వర్సెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్లుగా తయారవుతోంది. 

అసలే ఎంపీ బైరెడ్డి శబరితో నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. మరోవైపు తమ నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్నట్లు ఎంపీ ముందస్తుగా సమాచారం ఇవ్వడంలేదని ఎమ్మెల్యేలు మరింత కోపంగా ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎంపీ కలుపుకుని వెళ్లడం లేదని, ఆమె చర్యలను బట్టి తమ రియాక్షన్ ఉంటుందనేలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యేలు తాము వెళ్లకుండా, తమ అనుచరులు సైతం ఆ కార్యక్రమాలలో పాల్గొనకుండా చేయడంతో నంద్యాలలో టీడీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.  

ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు.