Andhra Pradesh News | కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం లభ్యత కోసం శోధించడానికి  చేపట్టిన తవ్వకాలను ఆపేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని  అధికారులకు ముఖ్యమంత్రి చెప్పినట్టు  కర్నూలు జిల్లా అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి  భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టత ఇచ్చారు.


 అసలేంటి వివాదం 


 కర్నూలు జిల్లా లోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో  అత్యంత నాణ్యత గల యురేనియం ఉన్నట్టు కేంద్రం కనుగొనడంతో  ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం రంగం సిద్ధం చేసింది. కోరుట్ల మయ్య మల గా పేరు పొందిన  ఈ అడవిలోని 468. 25 హెక్టార్ల విస్తీర్ణంలో  యరేనియం ఉన్నట్టు గుర్తించారు. అయితే దీనిపై  స్థానిక గ్రామాల ప్రజలకు  అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రధానంగా 13 గ్రామాలు మొత్తం కలిపి 25 గ్రామాల వరకు  యురేనియం తవ్వకాల వల్ల  దెబ్బతింటాయి అనేది  ప్రాథమిక అంచనా. అలాగే పర్యావరణం, నీరు, భూమి 50 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం బారిన పడతాయి అనేది  పర్యావరణ వేత్తల ఆందోళన. అకస్మాత్తుగా  వారం రోజుల క్రితం  యురేనియం భూమి అడుగున ఎంత లోతున ఉందో పరీక్షించడానికి 68 బోర్లను తవ్వే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  కప్పట్రాళ్ల సహా  ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి కర్నూలు బళ్ళారి రహదారిని దిబ్బంధం చేశారు.


పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తత కు లోను కావడంతో కొన్ని రోజులుగా  అక్కడ ప్రజలతో అధికారులు,అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ  తమ ఊళ్లను వదిలి వెళ్ళేది లేదని కప్పట్రాళ్ల సహా  13 గ్రామాల ప్రజలు పోరాటం చేయడంతో  అక్కడ ఆ బోర్ల తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.



 తాత్కాలిక ఊరటేనా?


 అయితే యురేనియం తవ్వకాలు అనేది  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కప్పట్రాళ్ల అడవిలోని యురేనియం చాలా శుద్ధమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల విద్యుత్, మెడికల్, డిఫెన్స్ రంగాల్లో  చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో  కేంద్రం  ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాల పిలిపివేతను  పూర్తిగా నిలిపివేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.