Chandrababu Kurnool Tour: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో 16 నుంచి 18 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి సభలు నిర్వహించనున్నారు. 16. 17 తేదీల్లో పత్తికొండ, అదోని, ఎమ్మిగనూరులో పర్యటిస్తారు.
జిల్లాలో పార్టీకిి పూర్వ స్థితి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా సభలు నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలు, సీఎం జగన్ అసమర్ధ పాలన, టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు, రైతులు, వ్యాపారులు, సామాన్యుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గళమెత్తనున్నారు. నిరుద్యోగ సమస్యలు, పెరిగిన ధరలు వీటిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారు.
చంద్రబాబు పర్యటనను విజయంతం చేయాలని జిల్లా ఇన్ ఛార్జి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా తెదేపా రాష్ట్ర పరిశీలకులు ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్
16-11-2022.
ఉదయం 11గంటలకు హైదరాబాద్ లో బయలు దేరి 12 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు అక్కడి నుంచి నంద్యాల ,నన్నూరు ,కర్నూల్ బైపాస్ ,బళ్లారి చౌరస్తా ,పెద్దపాడు ,కోడుమూరు , కరివేముల ,దేవనకొండ ,దూదే కొండ మీదుగా 4 గంటలకు పత్తికొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారు . 4 గంటల నుంచి 5: 30 వరకూ రోడ్ షో లో పాల్గొని 5:30 కు పత్తికొండ లోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ సమీపంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు . రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 8 గంటలకు ఆదోని లోని చేకూరి ఫంక్షన్ హాల్ చేరుకొని అక్కడే రాత్రి ఉంటారు.
17-11-2022
ఉదయం 10.30 గంటలకు ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు బయలుదేరుతారు. అక్కడ రోడ్ షో, తేరుబజారులో బాదుడే బాదుడు సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
18-11-2022
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ నాయకులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
మూడుచోట్ల రోడ్ షోలు
పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరులో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. బాదుడే-బాదుడు కార్యక్రమాలు చేపడతారు. రెండో రోజు పర్యటన పూర్తయిన తర్వాత చంద్రబాబు కర్నూలు చేరుకుంటారు. మూడో రోజు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్టీలో కొంత మంది చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు.