Nandyal Wall Collapse Incident: నంద్యాల జిల్లాలో (Nandyal District News) టీడీపీ నేతకు చెందిన ఓ గోడ కూల్చివేత ఘటన ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. నంద్యాల మార్కెట్‌ యార్డు (Nandyal Market Yard) ఛైర్మన్‌ మురళీ కృష్ణ గౌడ్‌కు చెందిన గోడను కూల్చారు. ఆయనకు ఓ వెంచర్‌ ఉండగా, దానికి ఆయన రక్షణ ఓ గోడను నిర్మించుకున్నారు. అయితే, ఈ గోడను కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) అధికారులు మంగళవారం (నవంబరు 15) కూల్చి వేశారు.


అయితే, ఆ వెంచర్ చుట్టూ గోడను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్నారని కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఆరోపించారు. దీంతో అధికారులు పొక్లెయిన్‌ తెచ్చి కూల్చివేతకు రెడీ అయ్యారు. ఇంతలో వెంచర్‌లోని ఇళ్ల యజమానులు, మురళీ కృష్ణ గౌడ్‌, ఆయన సోదరులు అడ్డుకున్నారు. అనుమతులు లేనందువల్లే తాము గోడను కూల్చి వేశామని చెప్పారు. అయితే, లే అవుట్‌కు కుడా (కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అనుమతులున్నాయని బాధితులు చెప్పారు. 


తాము టీడీపీ (TDP) లీడర్లం అయినందుకే ఇలా తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రహరీని కూల్చి వేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదేశించారని బాధితులు ఆరోపించారు. ఆయన తమ గోడను అక్రమంగా కూల్చి వేయిస్తున్నారని వాపోయారు. తాము ఆ ప్రహరీ కట్టి పదేళ్లు అవుతోందని, పదేళ్లుగా ప్రహరీ ఉండగా, కుడా అధికారులకు ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు వచ్చిందని ప్రశ్నించారు. 


ఘటనా స్థలానికి టీడీపీ నేతలు


గోడ కూల్చిన విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అక్కడకు వచ్చారు. అధికారులను ఎదిరించారు. డోన్‌ పట్టణంలో అక్రమంగా కట్టిన కట్టడాలు, నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని ముందు వాటి సంగతి చూడాలని అధికారులను నిలదీశారు. ముందు వాటిని పడగొట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నట్టుండి ఈ గోడ పడగొట్టేందుకు గల కారణం.. ఇటీవల చంద్రబాబు (Chandrababu) మురళీ ఇంటికి వెళ్లడమే అని టీడీపీ నాయకులు అన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu News) ఇటీవల డోన్‌ పర్యటనలో భాగంగా మురళీ కృష్ణ గౌడ్‌ ఇంటికి వెళ్లారు. ఆ అక్కసుతోనే ఇలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అధికారులు గోడను పడగొడుతుండగా, తమకు ఒక 2 రోజుల సమయం ఇవ్వాలని  మురళీ కృష్ణ గౌడ్‌ అధికారులను వేడుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు తేలితే ప్రహరీని తామే కూల్చి వేస్తామని కోరారు. అయినా కుడా అధికారులు వినలేదు. ప్రహరీని పడగొట్టాలంటూ పొక్లెయిన్‌ డ్రైవర్‌ను అధికారులు ఆదేశించడంతో ఆయన గోడను పాక్షికంగా కూల్చివేశాడు. ఆగాలని, మరింత కూల్చవద్దని టీడీపీ నాయకులు డ్రైవర్‌ను కూడా కోరారు. దీంతో ఆ డ్రైవర్‌ కూల్చివేతను నిలిపివేశారు. కాసేపటికి పొక్లెయిన్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


Also Read: చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్ - బీజేపీపై సేమ్‌ టు సేమ్ పోరాటం ! చివరికేమవుతుంది ?