Chandrababu: దుర్మార్గులు రాష్ట్రానికి ద్రోహం చేశారు - వైసీపీని బంగాళాఖాతంలో పారేయండి, చంద్రబాబు పిలుపు

ABP Desam Updated at: 03 Aug 2023 10:45 PM (IST)

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి టౌన్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.

కదిరి రోడ్ షోలో చంద్రబాబు

NEXT PREV

ఆంధ్రప్రదేశ్‌పై దుర్మార్గులు శీతకన్ను వేశారని, తెలుగు జాతికి తీరని అన్యాయం చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తెలుగు జాతి తరపున తాను తీసుకుంటున్నానని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి టౌన్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపైనే కాకుండా, పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీరును ప్రశ్నించారు.


ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం


ఐటీ ఉద్యోగులకు చక్కని పని వాతావరణ కల్పిస్తానని చంద్రబాబు అన్నారు. ‘‘కరోనా సమయంలో అందరూ వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ వర్క్ ఫ్రం హోం చేసుకొనేలా ప్రపంచంలోని ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకొని వస్తా. ఇంట్లో పని చేసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి, ప్రధాన మండల కేంద్రాల్లోనే వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి నెలలో పది రోజులు అక్కడి నుంచి పని చేసుకొనేలా విధానం తెస్తాం. అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం’’


షర్మిల విషయంలోనూ చంద్రబాబు వ్యాఖ్యలు


సీఎం జగన్ విశ్వసనీయత ఏంటో ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలను అడగాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా జగన్ తరిమేశాడని ఆరోపించారు. పురుషులు, మహిళలకు వారసత్వంగా సమాన హక్కు వచ్చేలా ఆనాడు ఎన్టీఆర్ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. సొంత ఆడబిడ్డకు అన్యాయం చేసి పంపేశాడని, జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన పాదయాత్రను షర్మిల కొనసాగించి జగన్‌కు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆమెను పట్టించుకోకుండా వెళ్లగొట్టారని అన్నారు. ఇది వెన్నుపోటు కాదా అని ప్రశ్నించారు. జగనన్న వదిలిన బాణం దారితప్పి ఎక్కడికో వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ఎంపీ టికెట్‌ ఇస్తానని షర్మిలతో పాదయాత్ర చేయించి, రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో సమాన వాటా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.



దుర్మార్గులు వచ్చి పోలవరంపై శీతకన్ను వేశారు. డయాఫ్రం వాల్, కాపర్ డ్యాం పోయాయి. చివరికి ప్రాజెక్టు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గులు చేసిన పాపం రాష్ట్ర ద్రోహం. తెలుగు జాతికి తీరని అన్యాయం. నేను హామీ ఇస్తున్నా. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగు జాతి తరపున నేను తీసుకుంటా. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి.-


‘‘వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు దాడులకు ప్రయత్నిస్తే మీరూ ఎదురు తిరగండి. కర్రలతో దాడికి వస్తే.. కర్రలతోనే బడిత పూజ చేయండి. ధర్మాన్ని కాపాడడానికి మనం చేసేది కూడా ధర్మయుద్ధమే. ఇందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు ధైర్యంగా ముందుకు రావాలి. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’’ అని అన్నారు. నిన్న పులివెందులలో వివేకానంద రెడ్డిని చంపింది ఎవరంటే జగన్‌ కుటుంబమేనని పులివెందుల ముక్తకంఠంతో నినదించారని అన్నారు. వివేకా హత్యపై సునీత అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు.

Published at: 03 Aug 2023 10:03 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.