రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో డెవలప్ మెంట్ కోసం తాము రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టామని, రాయలసీమ ద్రోహి అయిన జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ.2 వేల కోట్లే అని అన్నారు. జగన్ పదే పదే బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానంటున్నారని ఎద్దేవా చేశారు. బటన్‌ నొక్కడం కాకుండా.. బటన్‌ బుక్కుడు ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా నిత్యావసరాల ధరలు పెంచడంతో పాటు విద్యుత్‌ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని, ఇప్పటికి 8 సార్లు పెంచారని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు మంగళవారం (ఆగస్టు 1) పర్యటించారు. నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించి, అందులో మాట్లాడారు. ముచ్చుమర్రి, బనకచర్ల వంటి నీటి ప్రాజెక్టులను సందర్శించారు.


వైఎస్ఆర్ సీపీ పాలనలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సైకో తయారు అవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తాటతీస్తానని, వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘సీఎం జగన్ గట్టిగా ఒక గంట పని చేయగలవా? సాయంత్రం 6 అయితే, కనిపిస్తావా? - పుట్టుకతో వృద్ధుడైన సైకో’ అంటూ చంద్రబాబు కౌంటర్లు వేశారు.






టీడీపీ హయాంలో ఎన్నో నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని అన్నారు. హంద్రీనీవా, తెలుగు గంగ, ముచ్చుమర్రి, ఎస్‌ఆర్‌బీసీ లాంటి ప్రాజెక్టులు టీడీపీనే చేపట్టిందని గుర్తు చేశారు. రాయలసీమ కోసం జగన్‌ చిత్తశుద్ధితో పని చేశారా? అని నిలదీశారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా సీఎం జగన్ చేశారని అన్నారు.


సరిగ్గా రోడ్ల వేయలేరు కానీ, మూడు రాజధానులు కడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులు అనడం అర్థం లేని పనిగా కొట్టి పారేశారు. మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా సీఎం జగన్‌ తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. పరదాల మాటున జగన్‌ పర్యటనలు ఉంటున్నాయని, ధైర్యం ఉంటే ప్రజల మధ్యలోకి రావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీని నామరూపం లేకుండా చేస్తేకానీ, ఏపీ మంచి న్యాయం జరగబోదని చంద్రబాబు అన్నారు.