మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసు విచారణలో మరో ట్విస్ట్. విచారణకు పిలిచినప్పుడల్లా వివిధ కారణాలతో గైర్హాజరవుతున్న అవినాష్ రెడ్డి విషయంలో దూకుడుగా వెళ్లాలని సీబీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సీబీఐ సీరియస్
తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కొన్ని రోజుల వరకు విచారణ రాలేనని ఆదివారం రాత్రి సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సీబీఐ సీరియస్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా కర్నూలు జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారులు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని లొంగిపోవాలంటూ రాయబారం పంపించారని సమాచారం.
ఎస్పీతో మంతనాలు
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఉదయం నుంచి ప్రయత్నాలు సీబీఐ చోస్తోందట. ఓ బృందం కర్నూలు కూడా వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే కర్నూలు ఎస్పీతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అవినాష్‌ను లొంగిపోవాలంటూ చెప్పాలని ఎస్పీకి సమాచారం ఇచ్చారట.
అరెస్టుకు ప్రయత్నాలు
అవినాష్‌ను అదుపులోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ప్రస్తుతం అవినాష్ అమ్మ ఆరోగ్య పరిస్థితిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారని టాక్. ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇన్నాళ్లు హైదరాబాద్ కేంద్రంగా నడిచిన హైడ్రామాకు ఇప్పుడు కర్నూలు వేదిక అయింది. నాలుగు రోజులుగా కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం ఉంది.
శుక్రవారం నుంచి కర్నూలులో హైటెన్షన్
శుక్రవారమే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి రావాల్సి ఉంది. కానీ తన తల్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సీబీఐకి సమాచారం ఇచ్చి పులివెందుల బయల్దేరి వెళ్లారు. తల్లిని కర్నూలులో చేర్పించాలని అక్కడకు వెళ్లిపోయారు. ఎంపీ వైఎస్ అనినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు విశ్వభారతి ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. దీంతో అవినాష్ సీబీఐ కార్యాలయానికి వెళ్లకుండా ఆగమేఘాల మీద తల్లిని చూసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చుక్కలూరు వద్ద తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్ చూసి, వెంట తన కాన్వాయ్‌తో అవినాష్ హైదరాబాద్‌కు బయల్దేరారు. కానీ ఏమైందో కానీ ఆమెను కర్నూలు తీసుకెళ్లిపోయారు.
కర్నూలు నగరంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైద్యులు ఆమెకు గుండె సంబంధిత పరీక్షలు చేశారు. లోబీపీ, ఈసీజీలో కొన్ని మార్పులు ఉన్నాయని, కార్డియాక్ ఎంజేమ్స్ బాగా పెరగడం వల్ల యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ హితేష్‌రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఈ టైంలోనే సోమవారం కచ్చితంగా విచారణకు రావాల్సిందేనంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. దీనికి రిప్లై ఇచ్చిన ఎంపి.. తన తల్లి ఆరోగ్యం కుదట పడే వరకు విచారణకు రాలేనంటూ లేఖ రాశారు. చికిత్స పొందుతున్న తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత విచారణకు రావడానికి ఏ ఇబ్బంది లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పలుమార్లు వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల ఈనెల 16, 19న రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరు కావడం తెలిసిందే. మరోసారి తాను విచారణకు హాజరు కాలేనంటూ వైసీపీ ఎంపీ లేఖ రాయడంతో సీబీఐ ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.