హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ తాను రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉన్న కారణంగా సోమవారం విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్న తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత విచారణకు రావడానికి ఏ ఇబ్బంది లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కాగా, పలుమార్లు వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల ఈనెల 16, 19న రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరు కావడం తెలిసిందే. మరోసారి తాను విచారణకు హాజరు కాలేనంటూ వైసీపీ ఎంపీ లేఖ రాయడంతో సీబీఐ ఎలా స్పందిస్తున్నంది ఏపీలో ఉత్కంఠ నెలకొంది.
తన తండ్రి ఇప్పటికే జైల్లో ఉన్నారని.. తన తల్లిని చూసుకోవాల్సి ఉన్న కారణంగా విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి వాదన. ఇదే అంశాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చేలా ఆయన తరపు లాయర్లు ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు కూడా చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఎంపీ వైఎస్ అనినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు రెండు రోజు కూడా విశ్వభారతి ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. దీంతో అవినాష్ సీబీఐ కార్యాలయానికి వెళ్లకుండా ఆగమేఘాల మీద తల్లిని చూసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చుక్కలూరు వద్ద తల్లి లక్ష్మమ్మను అంబులెన్స్ చూసి, వెంట తన కాన్వాయ్‌తో అవినాష్ హైదరాబాద్‌కు బయల్దేరారు.
కర్నూలు నగరంలోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లి లక్ష్మమ్మ పరిస్థితి బాగోలేకపోవడంతో కర్నూలు నగరం గాయత్రి ఎస్టేట్‌లోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్చించారు. వైద్యులు ఆమెకు గుండె సంబంధిత పరీక్షలు చేశారు. లోబీపీ, ఈసీజీలో కొన్ని మార్పులు ఉన్నాయని, కార్డియాక్ ఎంజేమ్స్ బాగా పెరగడం వల్ల యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ హితేష్‌రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సీబీఐ విచారణకు హైదరాబాదులోని తన ఇంటి నుంచి అవినాష్ రెడ్డి బయలుదేగా.. అదే సమయంలో పులివెందులలో తమ స్వగృహంలోనే ఆయన తల్లి వైఎస్ లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు. ఆమెను పులివెందులలోనే ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సిన అవినాష్ రెడ్డి రూట్ మార్చి పులివెందులకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కర్నూలు, డోన్ మీదుగా గుత్తికి చేరుకున్నారు. అయితే లక్ష్మమ్మకు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాదుకు తరలిస్తుండగా.. . తల్లితో పాటు అవినాష్ రెడ్డి వెళ్తారని అంతా భావించారు. కర్నూలు నగరానికి రాగానే అంబులెన్స్‌ను గాయత్రి ఎస్టేట్‌కు మళ్లించి విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్పించడం తెలిసిందే.