Sugavasi Bala Subramanyam |  ఒకవైపు కోట అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని అధికార పార్టీ సంబరాలు చేసుకుంటుంటే  మరోవైపు రాయలసీమలో  టిడిపికి గట్టి షాక్ తగిలింది. టిడిపి స్థాపించినప్పటి నుంచి పార్టీ తోటే ఉంటున్న  సుగవాసి కుటుంబ వారసుడు గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన  సుగవాసి బాలసుబ్రమణ్యం  టిడిపికి రాజీనామా చేశారు.  రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన  బాలసుబ్రమణ్యం గత కొన్ని రోజులుగా  పార్టీ అధిష్టానం పై  అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తన రాజీనామా లేఖ పంపించారు.

మహానాడు జరిగిన వారం రోజులకే కడపలో టీడీపీ కి షాక్

 సుగవాసి బాలసుబ్రమణ్యం  కుటుంబం ఉమ్మడి కడప జిల్లాలో మొదటి నుంచి టిడిపి తో అంటిపెట్టుకుని ఉంది. ఆయన తండ్రి సుగవాసి పాలకొండ రాయుడు  ఎంపీగా, ఎమ్మెల్యే గా పనిజేశారు.1978 లో జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన కొండ్రాయుడు 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ హవాను తట్టుకుని మరీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా 16700 మెజారిటీ తో గెలిచారు. నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు తర్వాత  అయినా నందమూరి తారక రామారావుకి మద్దతు పలికారు. దానికి ప్రతిఫలంగా మళ్ళీ సీఎం అయిన తర్వాత ఎన్టీఆర్ స్వయంగా సుగవాసి ని టిడిపిలోకి  ఆహ్వానించి 1984 లో  రాజంపేట ఎంపీని చేసారు. అప్పటినుంచి టిడిపికి  ఫ్యామిలీ నమ్మకంగా ఉంటూ వచ్చింది. 1999, 2004 ఎన్నికల్లో  రాయచోటి నుండి ఎమ్మెల్యే అయ్యారు.

ఆయన వారసుడిగా  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన  బాల సుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా  చివరి క్షణం లో రాజంపేట టికెట్ ఇవ్వడంతో  అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలకు సన్నద్ధం అవ్వడానికి సరైన సమయం ఇవ్వకపోవడంతో పాటు  సొంత పార్టీ నేతలే తనకు వెన్నుపోటు పొడిచారని సుగవాసి బాలసుబ్రమణ్యం  చాలాకాలంగా అసహనంతో ఉన్నారు. ఇటీవల ఆయన తమ్ముడు  టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్ బాబు మాట్లాడుతూ  తమను ఓడించిన వారు తాత్కాలికంగా  సంతోషపడినా అంతిమ విజయం తమదే అని అన్నారు .

2029 ఎన్నికల్లో  ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా  ఇండిపెండెంట్గా గెలిచే  సామర్థ్యం తమకుందని  ప్రసంగించడంతో  అప్పటి నుంచే సుగవాసి కుటుంబం పార్టీకి దూరమవుతుంది  అని ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు కార్యకర్తలు చనిపోతే పరామర్శకు వెళ్లే లోకేష్  మాజీ మాజీ, ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయిన తమ తండ్రి చనిపోతే  కనీసం కడప మహానాడు సందర్భంగా  అయినా పక్కనే ఉన్న తమ కుటుంబాన్ని  పరామర్శించలేదని సన్నిహితుల దగ్గర  బాలసుబ్రమణ్యం బాధపడినట్టు తెలుస్తోంది.  వీటన్నిటి దృష్ట్యా  బాలసుబ్రమణ్యం టిడిపికి రాజీనామా చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను అక్కడ పార్టీ ఇన్చార్జులుగా నియమించిన టీడీపీ  తనను మాత్రం పక్కన పెట్టింది అనేది బాలసుబ్రమణ్యం ప్రధాన ఆరోపణ. పార్టీలోని మరొక వర్గం తమకు వ్యతిరేకంగా పనిచేస్తుందని  ఇప్పటికే పలుమార్లు సుగవాసి కుటుంబం విమర్శలు చేస్తూ వచ్చింది.

త్వరలో వైసీపీ గూటికి?

సుగవాసి కుటుంబం మొదటి నుంచీ తమకు పట్టున్న  రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అడుగుతోంది. కానీ టిడిపి రాజంపేటకు పంపడం తోటే ఓడిపోయామని  బాల సుబ్రమణ్యం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే టికెట్ తమకు  ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు.  సామాజికంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో  వైసిపి ఆయనతో చర్చల ప్రారంభించినట్లు సమాచారం. బాలసుబ్రమణ్యం కు రాయచోటి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామని  హామీ ఇచ్చినట్టు కూడా  ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇదే కనుక నిజమైతే త్వరలోనే అయిన  వైసిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.