Sri Sathya Sai district | రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ దళిత బాలికపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది.
అసలేం జరిగిందంటే..
శ్రీ సత్య సయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ దళిత మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు స్నేహంగా ఉండేవారు. ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన బాలుడు చనువుగా ఉండే వీడియో బయటకు రావడంతో మరికొందరు యువకులు ఆ వీడియోతో ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆ వీడియో చూపించి బాలికను లోబరుచుకున్నారు. బాలిక స్నేహితుడితోపాటు ఆ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 13 మంది యువకులు గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడిన బాలిక తల్లి
మైనర్ బాలిక గర్భం దాల్చడంతో మొదటి ప్రేమించిన దళిత యువకుడి దగ్గరకు వెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడగా.. పెళ్లి చేసుకోవడానికి అతడు నిరాకరించాడు. మీరు ఇలాగే నన్ను ఇబ్బంది పెడితే ఊరు వదిలి వెళ్ళిపోతానని బాలిక తల్లితో అన్నాడు. ఏం చేయాలో తెలియక గ్రామ పెద్దల వద్దకు బాలిక తల్లి వెళ్లడంతో వారు కూడా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవాలని కోరారు. తనపై గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో అతడు ఊరు వదిలి వెళ్లపోయాడు.
పోలీసుల అదుపులో నిందితులు :
రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై పోలీసులు స్పందించారు. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కీలకంగా ఉన్న అభిషేక్ పాటు మరో ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగతా 6 మంది పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్.. ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌ను ఆదేశించారు.
రాజకీయరంగు పులుముకుంటున్న ఘటన
ఏడుగురాళ్లపల్లిలో జరిగిన మైన బాలిక అత్యాచార ఘటన రాజకీయర రంగు పులుముకుంటోంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో పలు పార్టీల నేతలు ఉండటంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపీ నేతలు ఇప్పటివరకు శవ రాజకీయాలే చేసేవారు, ఇప్పుడు దళిత మైనర్ బాలిక ఘటనపై రాజకీయం చేయటం సరికాదని హితవు పలికారు.
వైసీపీ సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ.. రాజకీయ కోణంలో కేసులు పెట్టడానికి పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు చేసి, బాధిత బాలికకు న్యాయం చేయాలన్నారు.