ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర విద్యుత్ మరియు అటవీశాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ది కోసమే మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారని, ఆయనకు నిజంగానే బాధ కలిగి ఉంటే అసెంబ్లీలో అదే సమయంలో ఏడ్చే వారని బాలినేని అన్నారు. గతంలో తమిళనాడు మాజీ సీఎం  జయలలిత శపథం చేసినట్లు చంద్రబాబునాయుడు కూడా ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలో కాలుపెడతానని శపథం చేశారని.. అది ఆయన తరం కాదని, ఎన్టీఆర్ ఫ్యామిలీ రంగంలోకి దిగితేనే పరిస్థితి కాస్తయినా మారుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.


కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల బిల్లు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు గాడిన పెడతామన్నారు. పేదల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబుకు నిజంగా కష్టం కలిగి ఉండే అసెంబ్లీలో అదే సమయంలో కన్నీళ్లు పెట్టుకునే వాళ్లు అని, తరువాత మీడియా ముందుకొచ్చి ఏడ్చి రాజకీయ డ్రామాలు చేశారని ఆరోపించారు.
Also Read: Cyclone Jawad: ఏపీ వైపు దూసుకొస్తున్న జవాద్ తుపాను.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు



జయలలిత తరహాలో చంద్రబాబు చేసిన శపథం కలగానే మిగిలిపోతుందన్నారు. పార్టీ నడపాలంటే లోకేష్ వల్ల కాదని, చంద్రబాబుకు ఏదైనా మేలు జరగాలన్నా, పార్టీ బలోపేతం కావాలన్నా ఎన్టీఆర్ ఫ్యామిలీ రంగంలోకి దిగితేనే ప్రయోజనం ఉంటుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం రూ.70 వేల బకాయిలు పెట్టిందని, వాటిని తీర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై పడటం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలను టీడీపీ మభ్యపెట్టి, తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు. హైదరాబాద్ ను కోల్పోవడం ద్వారా ఆర్థిక వనరులు చేజారి.. తమకు కాస్త ఇబ్బందులు తలెత్తాయని వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితుల్ని ఆదుకుంటామని, రైతులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Also Read: AP CM Jagan : 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ - సమాచారం లేదన్న ఉద్యోగ సంఘాలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి