రైతులకు అందించే పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ నిధులు విడుదల చేస్తారు. పెట్టుబడి సాయం కింద గతేడాది 51.41 లక్షల మందికి రైతులకు సాయం చేశారు. ఈ ఏడాది 52.31 లక్షల మందికి సాయం చేయనున్నారు. వీరికి తొలివిడతగా 7,500 చొప్పున మొత్తం 3,934.25 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. 


ఇటీవల అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టానికి సంబంధించిన అంచనాలను అధికారులు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. వాళ్లకి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వనుంది ప్రభుత్వం. రైతు భరోసా ఇచ్చే వేదికపైనే మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారు. 


వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలను అందిస్తున్నారు. వెబ్‌ ల్యాండ్ ఆధారంగా అర్హులైన రైతులకు ఈ సాయం అందిస్తున్నారు. కౌలుదారులకు కూడా ఈ డబ్బులు ఇస్తున్నారు. తొలి విడత మేలో, రెండో విడత అక్టోబర్‌లో మూడో విడత జనవరిలో ఇస్తున్నారు. 


ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుకుంటున్న వారిలో భూ యజమానులు 50,19,187 మంది కాగా, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్లు 91,752 మంది, ఇంకో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 


2019–20లో 46,69,375 మంది రైతులు 6,173 కోట్ల రూపాయలు సాయం చేస్తే తర్వాత ఏడాది 51,59,045 మందికి 6,928 కోట్ల రూపాయలు, 2021–22లో 52,38,517 మందికి 7,016.59 కోట్ల రూపాయలు, 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇప్పుడు 52.31 లక్షల మంది తొలివిడతగా 3,934.25 కోట్ల రూపాయలు అందుకోనున్నారు. 


గత మూడు నెలల్లో కురిసిన అకాల వర్షాలకు 78,510 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు కాగా, 19వేలకుపైగా ఉద్యాన పంటలు పాడైనట్టు అదికారులు లెక్కకట్టారు. ఇలా నష్టపోయిన 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల రూపాయలు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం సాయం చేయనుంది. 


Also Read:గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్!


Also Read:అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి - పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు